చిట్టి న్యూస్

తాళ్లూరు లిప్ట్‌కు నిధులు కేటాయించాలి- జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా జగ్గంపేట గాడేపల్లి మండలం తాళ్లూరు లిప్ట్‌కు, సీఎస్‌ఆర్‌ నిధులు కేటాయించాలన్నారు జ్యోతుల నెహ్రూ. మెట్టప్రాంత రైతులు నారుమడులు వేసుకునే సమయంలో నీరు అందక, ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా తాళ్లూరు లిప్ట్ ఇరిగేషన్, ఆనాడు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ లిప్ట్‌ ఇరిగేషన్‌పై వందలాటి రైతులు ఆధారపడి ఉన్నారన్నారు జ్యోతుల నెహ్రూ. తాళ్లూరు లిప్ట్ మూడు పంపులు పాడై, నిరుపయోగంగా ఉందని, కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

హైదరాబాద్‌ ఓయూలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.. ఉదయం నుంచి ఓయూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.. సిలబస్‌ పూర్తికాకుండానే పరీక్షలు పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. యూజీసీ రూల్స్‌ ప్రకారం సెమిస్టర్స్‌కు కనీసం 120 పని దినాల తర్వాతే పరీక్షలు పెట్టాలని వారు డిమాండ్‌ చేశారు.. కనీసం రెండు నెలలు కూడా పాఠాలు చెప్పకుండా పరీక్షలు పెడుతున్నారని ఫైరవుతున్నారు..

Rajamundry: గోడలపై ఉన్న శ్రద్ధ రోడ్లపై లేదే!

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌సీఎం అధికారులు సుందరీకరణ పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చేపడుతున్న పనులపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.. చినుకు పడితే మునిగిపోయే ప్రాంతాలను పట్టించుకోని కార్పొరేషన్‌ యంత్రాంగం, ఆనం కళా కేంద్రం, సుబ్రహ్మణ్య మైదానంలో అనవసర ఖర్చు చేసి సుందరీకరణ పనులు చేపడుతోందని ఫైరవుతున్నారు. ఇవేం పనులంటూ బహిరంగంగానే మండిపడుతున్నారు.

ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆనం కళా కేంద్రం, సుబ్రహ్మణ్య మైదానం ప్రహరీ గోడకు లక్షలు ఖర్చు చేసి సుందరీకరణ పనులు చేపట్టారు. లక్షల రూపాయల వ్యయంతో రంగులు వేసి నిధులు వృధా చేయడమే లక్ష్యంగా అధికారుల తీరు ఉందని విమర్శలు వస్తున్నాయి. గతంలో రంగులతో ఉన్న ప్రహరీ గోడలను ఆగమేఘాల మీద కూల్చేశారు అధికారులు. వర్షంలోనూ నిరాటంకంగా పనులు కొనసాగిస్తున్నారు. ఉన్న వాటిని కూలగొట్టడం ఎందుకు, కొత్తగా రంగులేయడం ఎందుకని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. కేవలం కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చి తమ వాటాల కోసమే అధికార యంత్రాంగం ఇలాంటి చర్యలు చేపడుతోందని విపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన రహదారి అయిన కంబాల చెరువు హైటెక్‌ బస్టాండ్‌, కోరుకొండ రోడ్‌ సహా పలు ప్రాంతాల్లో గోదావరిని తలపించేలా వర్షం నీరు నిలిచిపోయింది. బస్సులు ఆగి ప్రజలు ఇబ్బంది పడిన సందర్భాలు కనిపించాయి. అయితే, ముంపు సమస్య నుంచి బయటపడే మార్గం గురించి ఏమాత్రం ఆలోచించని కార్పొరేషన్‌ అధికారులు. ఇలా సుందరీకరణ పనులకు కోట్లు తగలేయడం ఎందుకని పబ్లిక్‌ ఫైరవుతోంది. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. 

Hyderabad: నానోస్కోప్ టెక్నాలజీ ద్వారా భుజానికి సర్జరీ

హైదరాబాద్‌ కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. దేశంలోనే తొలిసాగిగా నానోస్కోప్‌ టెక్నాలజీ ద్వారా, భుజం స్పోర్ట్ సర్జరీల్లో నూతన విప్లవానికి మార్పు తీసుకొచ్చారు వైద్యులు. నానో స్కోపీతో కత్తిగాటు, కట్టు లేకుండా నీడీల్‌ షోల్డర్‌ సర్జరీ చేస్తారు. నొప్పిచాలా తక్కువగా ఉండడంతో, రోజూవారీ కార్యక్రమాలకు ఇబ్బందులు ఉండవన్నారు కిమ్స్‌ సన్‌షైన్‌ మేనేజింగ్ డైరెక్టర్ గురవారెడ్డి. నానో స్కోప్‌ షోల్డర్‌ స్పోర్ట్ సర్జరీలో, విప్లవాత్మకమైన మార్పుకు ఈ విధానం నాంది పలుకుతుందన్నారు గురవారెడ్డి.

ఆరు నెలల గర్భిణిపై కత్తితో పైశాచిక దాడి

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆరు నెలల గర్భిణిపై భర్త కత్తితో పైశాచిక దాడి చేశాడు. నక్కలదిన్నె తండా, బెంగళూరు రోడ్దులో మహమ్మద్ యూనద్.. భార్య షామీర్‌తో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి ఏడాది క్రితం పెళ్లి అయింది. ఉదయం బజారుకు వెళ్లి తిరిగి వచ్చిన యూనద్.. ఇంట్లో వంట చేస్తున్న భార్యను కత్తితో అతి దారుణంగా పొడిచి.. చిత్రహింసలకు గురిచేశాడు. పెళ్లి అయినప్పటి నుంచి భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు అవుతున్నాయని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Nizamabad: ఆర్మూర్‌లో జంట హత్యల కలకలం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జంట హత్యలు కలకలం రేపాయి. జిరాయత్‌నగర్‌లో వృద్ధులైన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై దుండగులు మారణాయుధాలతో దాడి చేసి చంపారు. ఒకేసారి ఇద్దరిని హత్య చేయడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతులు మగ్గిడి గంగవ్వ, మగ్గిడి రాజవ్వగా గుర్తించారు. నగల కోసం దొంగల ముఠా చంపినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. క్లూస్‌ టీంతో దర్యాప్తు చేపడుతున్నారు. 

గుంటూరులో మండుతోన్న టమాటా

ఘాటు మిర్చికి కేరాఫ్ అయిన గుంటూరులో ఇపుడు టమాట ఠారెత్తిస్తోంది. పెరిగిన టమాట రేట్లతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉంటున్నా టమాటాలు అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు.



కాకాని సభకు ప్రజలు గైర్హాజరు...

నెల్లూరు జిల్లా గూడూరులో మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డికి జనం షాక్ ఇచ్చారు. నూతన రైతుబజార్‌లో ఏర్పాటు చేసిన భారీ సభకు జనం రాలేదు. మంత్రి, ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నా.. సభ వైపు ప్రజలు కన్నెత్తి చూడలేదు. ఖాళీ కుర్చీలతో సభా ప్రాంగణం దర్శనమిచ్చింది.

Hyderabad: ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బీసీ ప్రతినిధుల సమావేశం

ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బీఆర్‌ఎస్‌ బీసీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశానికి.. బీసీ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఎంపీలు, స్టేట్‌ కమిటీ బీసీ సభ్యులు హాజరయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

Yuvagalam: కనిగిరిలో కొనసాగుతోన్న యువగళం

అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో హైదరాబాద్‌, చెన్నైను తలదన్నేలా ఏపీని అభివృద్ధి చేస్తామన్నారు లోకేష్‌. కనిగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌.. పెద్దలవలపాడు వద్ద వలసదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఉపాధి హామి కల్పిస్తామని హామి ఇచ్చారు.

సైనికుడి కుటుంబం పై దాడి

మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ సైనికుడి కుటుంబంపై బంధువులు దాడి చేశారు.  తల్లీ కూతుళ్లపై విచక్షణారహితంగా దాడులు చేయడంతో ఇరువురూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బయ్యారం మండలం ఉప్పలపాడు గ్రామంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

వైసీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన మహిళలు

వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు మహిళలు షాకిచ్చారు. కాకినాడ జిల్లా రాజుపాలెంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యేకు స్ధానిక మహిళల నుంచి నిరసన సెగ ఎదురైంది. నాలుగున్నరేళ్లు దాటిని ఇప్పటికి తమకు పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

యువగళానికి మద్దతుగా చింతమనేని కార్ ర్యాలీ

లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు మద్దతుగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. 300 కార్లులో లోకేష్ పాదయాత్ర జరిగే ప్రాంతానికి తరలి వెళ్లారు. ఈ ర్యాలీని చింతమనేని జెండా ఊపి ప్రారంభించారు.

భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు

భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా గత రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో 22 గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ఎగువన ఉన్న ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. 

ఖమ్మం జిల్లా సత్తుపల్లి భారీ వర్షాలు, స్థంభించిన జనజీవనం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్థంభించిపోయింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు పెనుబల్లి మండల పరిధిలోని లంకసాగర్ ప్రాజెక్టుకు, సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి పెద్ద చెరువుకు వరద నీరు చేరుకుంటోంది. పూర్తి సామర్ధ్యం 16 అడుగులు కాగా, ఇప్పటికే 15.5 అడుగులకు వరద నీరు చేరుకుంది. మరోవైపు భారీ వర్షాలకు జేవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్టులో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 

తుల్జా భవాని రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి జనగామ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. కూతురిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫిర్యాదుతో జూలై 1న.. తుల్జా భవాని రెడ్డి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద తుల్జా భవాని రెడ్డి బంధువు.. శివరామకృష్ణకు నోటీసులు ఇచ్చారు. క్రైమ్ నంబర్‌ 228/2023 కేసులో విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో.. తన బంధువుకు నోటీసులు ఎందుకు ఇచ్చారో తెలుసుకోవడానికి తుల్జా భవాని రెడ్డి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రామగుండంలో బొగ్గు వెలికితీత నిలిచియింది. మిడ్ మానేరు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 

మెళియాపుట్టి గ్రామ సచివాలయ ముట్టడి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని మెళియాపుట్టి గ్రామ సచివాలయాన్ని మహిళలు ముట్టడించారు. గతనెల 28న అమ్మ ఒడి పథకం బటన్ నొక్కారని.. ఇంతవరకు ఖాతాలో డబ్బులు పడలేదని మండిపడ్డారు. సచివాలయ సిబ్బందిని నిలదీశారు. రోజూ సచివాలయం, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపీలో నకిలీ ఓట్ల సృష్టికి భారీ కుట్ర-చినరాజప్ప

ఏపీలో నకిలీ ఓట్ల సృష్టికి భారీ కుట్ర జరుగుతోందని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఈనెల 21 నుంచి ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియలో బీఎల్ఓ పేరిట.. వాలంటీర్లనే పంపి సమాచారం సేకరణకు జగన్ పన్నాగ పన్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విలువైన ఓటు హక్కును జగన్ కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌కు ముందే ఓటమి భయం పట్టుకుందన్న చినరాజప్ప.. రాష్ట్రంలో 30 లక్షల ఓట్లు తొలిగించేందుకు వైసీపీ సర్కారు కుట్రలు చేస్తోందని విమర్శించారు.   

తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో కల్లోలం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో అధిపత్య పోరు సాగుతోంది. రామచంద్రాపురంలో మంత్రి వేణు వర్సెస్‌ ఎంపీ బోస్‌ గా పరిస్థితి మారింది. దీంతో రామచంద్రాపురం పంచాయితి తాడేపల్లికి చేరింది. సీఎంఓ నుంచి ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు ఫోన్‌ రావడంతో తాడేపల్లికి చేరుకున్నారు. సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. మంత్రి వేణు సమక్షంలోనే బోస్‌ వర్గానికి చెందిన మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ శివాజీ పై దాడి జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన శివాజీ చీమల మందు తాగి ఆత్మాహత్య యత్నం చేశారు.  

హైకోర్టులో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిటిషన్

ఖమ్మంలో తన భూములను ప్రభుత్వం సర్వే చేయడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దీనిపై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ ఇవాళ విచారణ చేపట్టనుంది. ఎస్సార్ గార్డెన్ లో 20 గుంటల భూమి ఉందంటూ అధికారులు సర్వే చేయడంపై ఈ పిటీషన్ దాఖలు చేశారు. 13 ఏళ్ల క్రితం గార్డెన్ నిర్మించామని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా.. భూముల్ని సర్వే చేసిందన్నారు పొంగులేటి.


భూకబ్జా ఆరోపణలపై స్పందించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తన లాంటి వ్యక్తి 20 గుంటలు కబ్జా చేశానని నింద మోపడం దారుణమన్నారు. తమ కుటుంబానికి అక్కడ 130 ఎకరాల భూమి ఉందన్నారు. BRSలో ఉంటే ఒక న్యాయం వేరే పార్టీలోకి వెళ్తే ఒక న్యాయమా? అంటూ ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు సెలవులు చూసి ఇబ్బందులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. 14 సంవత్సరాల నుండి లేని ప్రాబ్లం ఇప్పుడేలా వచ్చిందని ప్రశ్నించారు. ఖమ్మం సభ సక్సెస్ అయ్యిందనే ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోందన్నారు. న్యాయ స్థానం ద్వారా పోరాటం చేస్తానన్నారు పొంగులేటి

Guntur: మహిళల ధర్నాపై పోలీసుల కర్కశత్వం

గుంటూరులో పోలీసుల ఓవరాక్షన్ చేశారు. నల్లమడ రైతు సంఘం నేతల రిలే దీక్షలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన మహిళలపై ఉక్కుపాదం మోపారు. వృద్ధురాలు, మహిళలని చూడకుండా పోలీసుల కర్కశత్వం ప్రదర్శించారు. తీవ్రంగా అడ్డుకున్నా వదల్లేదు. కాళ్లు, చేతులు పట్టుకుని లాక్కెళ్లారు. బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్ ఎక్కించిన పోలీసుల తీరుపై మహిళలు, నల్లమడ రైతు సంఘాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

అంతకుముందు.. ఛానల్ పొడిగించాలని డిమాండ్ చేస్తూ నల్లమడ రైతు సంఘాల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు రైతులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా రైతులు ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం రైతులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అటు పోలీసుల తీరుపై నల్లమడ రైతు సంఘాల నాయకులు, రైతులు తీవ్రంగా మండిపడ్డారు. గత 20 రోజులుగా దశలవారీగా ఆందోళన చేస్తున్నా.. వైసీపీ ప్రభుత్వంలో చలనం రావడం లేదని ఆరోపించారు. అరెస్టులకు భయపడేది లేదని.. ఛానల్ పొడగించేవరకు పోరాటాన్ని ఆపేది లేదని రైతులు తేల్చిచెప్పారు.

Nellore:  రైతు భరోసా కేంద్రంలో భారీ అవినీతి

నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణక్రాకలో రైతు భరోసా కేంద్రంలో భారీ అవినీతి వెలుగు చూసింది. 2022 వరి పంటనష్టంపై విలేజీ అగ్రికల్చర్ అసిస్టెంట్, వాలంటీర్లు చేతివాటం ప్రదర్శించారు. సుమారు కోటి రూపాయల మేర రైతుల డబ్బులు పక్కదారి పట్టించారు. వాలంటీర్ల బంధువుల అకౌంట్‌లోకి లక్షల రూపాయలు మళ్లించినట్లు తేలింది. విషయం భయటపడకుండా ఉండేందుకు రైతులకు ఐదు లక్షల రూపాయలను VAA ప్రత్యూష ఎరగా చూపించారు. నిజమైన రైతులకు పంట నష్టం అందకపోవడంతో రైతు భరోసా కేంద్రం ముందు బైఠాయించి రైతులు నిరసన తెలిపారు.  

టీడీపీ అండతోనే ఈ స్థాయిలో ఉన్నా: జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి టీడీపీ కార్యకర్తల అండతోనే తాను ఈ స్థాయిలో ఉన్నారని అన్నారు. అదే లేకపోతే తన ముందు మూడు మార్గాలున్నాయని.. మొదటిది ఆత్మహత్య చేసుకోవడం, రెండవది ఊరు విడిచి పారిపోవడం, మూడవది ఎమ్మెల్యే కు కప్పం కట్టడం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీఐ ఆనందరావు ఆత్మహత్యపై కోర్టులో కేసు వేస్తానని అన్నారు. నియోజక వర్గంలో అక్రమ ఇసుక రవాణాను కచ్చితంగా అడ్డుకుంటానన్నారు ప్రభాకర్‌ రెడ్డి. 

ఏపీలో పోలీసుల తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్

ఏపీలో పోలీసుల తీరుపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. ఏపీ పోలీస్ వ్యవస్థలో కుల వ్యవస్థ చొరబడిందని ఆరోపించారు. కీలకమైన పదవులన్నీ జగన్ తన రెడ్డి సామాజికవర్గానికే కట్టబెడుతున్నారని విమర్శించారు. ఉన్నతపదవులు బడుగు, దళిత సామాజికవర్గానికి చెందిన అధికారులు అర్హులు కారా అని ప్రశ్నించారు. కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా మారారని వర్ల రామయ్య మండిపడ్డారు.

కోఠి డీఎంఈ ఆఫీస్‌ ఎదుట డాక్టర్ల ఆందోళన

హైదరాబాద్‌లోని కోఠి డీఎంఈ ఆఫీస్‌ ఎదుట డాక్టర్లు ఆందోళనకు దిగారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నుంచి అసోసియేట్‌ ప్రొఫెసర్ ప్రమోషన్లు ఆగిపోయాయని నిరసన తెలిపారు. ఖాళీలు ఉన్నా చూపడం లేదన్నారు. ఎన్‌ఎంసీ ప్రకారం వేకెంట్‌ చూపించకుండా 180 ఖాళీలే చూపారని మండిపడ్డారు. డీఎంఈ ఆఫీస్‌ ఎదుట అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. 

హైదరాబాద్‌లోని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌లోని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. TRT అభ్యర్థులు ఆందోళనకు దిగారు. TETతో పాటు DSC నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కోడ్‌కు ముందే నోటిఫికేషన్‌ ఇవ్వాలని పట్టుపట్టారు. వందలాది మంది అభ్యర్థులు తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

అనకాపల్లి ఏరియా ఆస్పత్రి ఎదుట ఆశావర్కర్ల ఆందోళన

అనకాపల్లి ఏరియా ఎన్టీఆర్‌ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత తలెత్తింది. వేతనాల పెంపు, ఇతర సమస్యలపై ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. డీఎంహెచ్‌వో బయటకురావాలని ఆశావర్కర్లు నినాదాలు చేశారు. డీఎంహెచ్‌వో అందుబాటులో లేకపోవడంతో....అడిషల్‌ డీఎంహెచ్‌వోకు వినతిపత్రం అందజేశారు.

విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల అరాచకం

విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల అరాచకం వెలుగులోకి వచ్చింది. కనిమెళ్ల గ్రామంలో నివసిస్తున్న రామారావు, సూరమ్మ దంపతులకు చెందిన ఇంటిని కొత్త సచివాలయ నిర్మాణానికి ఇవ్వాలని వైసీపీ నేతలు, అధికారులు కోరారు. వేరే చోట ఇల్లు నిర్మించి ఇస్తామని నాడు హామీ ఇచ్చారు. దీంతో ఆ వృద్ధులు తమ ఇంటిని సచివాలయ నిర్మాణానికి ఇచ్చారు. అయితే.. మూడున్నరేళ్లైనా హామీ నెరవేర్చలేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకుంటున్నారు. అధికారులకు ఎన్ని దరఖాస్తులు చేసినా ఫలితం లేకపోవడంతో వారు టీవీ5ని ఆశ్రయించారు. 

సత్యసాయి జిల్లాలో ఎలుగుబంట్ల కలకలం

సత్యసాయి జిల్లాలో ఎలుగు బంట్ల సంచారం కలకలం సృష్టించింది. అమరాపురం మండలంలోని గౌడనకుంట గ్రామంలో... రెండు ఎలుగు బంట్లు .. తిరుగుతూ.. గ్రామ ప్రజలని ఆందోళనకు గురి చేశాయి. ఇవి ఓ ఇంట్లో చొరబడటంతో .... అక్కడ ఉన్న ఓ అమ్మాయి భయాందోళనకు గురై పరుగులు పెట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీ రికార్డయ్యాయి. గ్రామస్థులంతా కలిసి వీటిని తరమడటంతో... ఇవి పొలాలు వైపు వెళ్లాయి. ఎలుగుబంట్ల సంచారంపై . అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు గుడ్‌బై

సీఎం జగన్‌కు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు షాక్ ఇచ్చారు. వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఈనెల 20న జనసేన అధినేత పవన్ సమక్షంలో ఆపార్టీలోకి చేరనున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్‌బాబు.. ఆపార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలకు వైసీపీలో గుర్తింపులేదని ఆరోపించారు. జనసేనలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానన్న పంచకర్ల.. పెందుర్తి నుంచి పోటీ చేస్తానన్నది తన వ్యక్తిగతమన్నారు. 


విజయవాడలో ఉద్రిక్తత

విజయవాడలో టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కోడూరు సుబ్రహ్మణ్యం దుకాణం కూల్చివేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. సుబ్రహ్మణ్యంను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రని అడ్డుకున్నారు పోలీసులు. తాడిగడప వద్ద ఆయన్ను అడ్డుకోవడంతో.. పోలీసులకు, కొల్లురవీంద్రకు మధ్య వాగ్వాదం జరిగింది. బీసీలపై దాడుల్ని ఖండిస్తే నేతల్ని అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు కొల్లు రవీంద్ర. ప్రభుత్వం బీసీలపై దాడులు, హత్యలు చేస్తుందంటుూ ఆరోపించారు. బీసీ హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని, పోలీసులను పావులా వాడుకుంటోందంటూ పైర్ అయ్యారు.  

విశాఖ ఏయూలో లైంగిక వేధింపులు కలకలం

విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజులుగా హిందీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నల్లా సత్యనారాయణ విద్యార్థినికి లైంగికంగా వేధిస్తున్నారు. అంతేకాదు పరిశోధన పూర్తి చేసేందుకు భారీ మొత్తంలో డబ్బులు కూడా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఫ్రొఫెసర్ లైంగిక వేధింపులు తాళలేక బాధితురాలు త్రీటౌన్ పోలీసులు, ఏయూ వీసీ, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. హిందీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నల్లా సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని కోరారు.

రాహుల్ గాంధీ పిటీషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు

గుజారాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణకు అంగీకరించింది సుప్రీంకోర్టు. ఈ నెల 21న విచారించనున్నట్లు తెలిపింది. మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల నేపథ్యంలో పరువు నష్టం కేసు ఎదుర్కొంటున్నారు రాహుల్. ఈ కేసులో రాహుల్ కు రెండేళ్ల శిక్ష విధించింది సూరత్ కోర్టు. దీంతో అనర్హత వేటకు గురైన రాహుల్ ఎంపీ పదవి పోగొట్టుకున్నారు. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ తీర్పును సమర్ధించింది గుజరాత్ హైకోర్టు. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు రాహుల్. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు దీనిపై నెల 21న విచారించనున్నట్లు తెలిపింది.

గుంటూరులో ఉద్రిక్తత

గుంటూరులో ఛానల్ పొడగించాలని డిమాండ్ చేస్తూ నల్లమడ రైతు సంఘాలు ఆందోళనను ఉధృతం చేశారు. కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపట్టగా.. రైతుల మహాధర్నాకు సంఘీభావం తెలిపేందుకు అమరావతి రైతులు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. కలెక్టరేట్‌ వైపు రైతులెవరూ రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అటు.. రైతుల రిలే దీక్షకు టీడీపీ, జనసేన, వామపక్షాలు మద్దతు తెలిపాయి. గత 20 రోజులుగా దశలవారీగా ఆందోళన చేస్తున్నా.. వైసీపీ ప్రభుత్వంలో చలనం రావడం లేదని నల్లమడ రైతు సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా.. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అత్యధికంగా భీంగల్ లో 7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఆర్మూర్, నందిపేట, వేల్పూరు, మాక్లూర్, కామారెడ్డి, తాడ్వాయి, నిజాంసాగర్ మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షాలతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం

నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు ..

జిల్లా వ్యాప్తంగా స్థంబించిన జనజీవనం

అత్యధికంగా భీంగల్ లో 7 సెంటీ మీటర్ల వర్షం