- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇష్టానుసారం సీఐడీ సోదాలు, అరెస్ట్‌లపై హైకోర్టులో మార్గదర్శి పిటిషన్ వేసింది. తనిఖీలు ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పిటిషన్‌పై విచారించిన ఏపీ హైకోర్టు.. రెండు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. తక్షణమే అరెస్ట్, సోదాలు నిలిపివేయాలని ఆదేశించింది.. మార్గదర్శి విషయంలో తండ్రి బాటలోనే వెళ్తున్న జగన్.. ఆ సంస్థపై కక్షగట్టారని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి.

కేసీఆర్‌ను ప్రజలు రెండు చోట్ల ఓడిస్తారని అన్నారు టీ. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేయడం ద్వారా కేసీఆర్ ఓటమిని ముందే ఒప్పుకున్నారని అన్నారు. తన సవాల్ స్వీకరించకుండా పారిపోయారని కామెంట్ చేశారు. ఇంత మందిని గెలిపించిన నాయకుడు.. రెండు చోట్ల పోటీ చేయడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోంది.. ఇందిరమ్మ రాజ్యం రాబోతుందన్నారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అన్న రేవంత్... 2014 ముందు ప్రతి ఎన్నికల్లో పొత్తుతోనే పోటీ చేయలేదా అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాపై బీజేపీ ఎంపీ అర్వింద్ స్పందించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని విమర్శించారు. గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తానని ప్రకటన చేయడంతో... కేసీఆర్ ముందు జాగ్రత్తగా రెండు చోట్ల పోటీకి దిగుతున్నారని అన్నారు. కామారెడ్డి నుంచి కాస్త ముందుకు వస్తే.. చిత్తు చిత్తుగా ఓడించేవాడినంటూ కామెంట్ చేశారు. బీఆర్‌ఎస్ లిస్టును చూస్తుంటే నిజామాబాద్ జిల్లాలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎన్నికల శంఖారావం మోగించింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ...115 స్థానాలకు సీఎం కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఈ సారి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. అందులో ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు. మంచి ముహూర్తం ఉండడంతో సోమవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్టు కేసీఆర్ తెలిపారు.

వైసీపీకి రాజీనామా చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీలో చేరారు. విజయవాడలోని నిడమానూరు శివారులో క్యాంప్ దగ్గర యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు లోకేష్.. ఈ సందర్భంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. వంశీ పోవాలి.. యార్లగడ్డ గెలవాలంటూ నినదించారు. ఆ తర్వాత లోకేష్‌తో యార్లగడ్డ వెంకట్రావు సమావేశమయ్యారు. రేపు గన్నవరంలో యువగళం భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. 2లక్షల మందితో టీడీపీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

యువతే ఈ రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అందరూ మాతృభాషలో మాట్లాడండి.. మాతృభాష మర్చిపోవద్దని విద్యార్ధులకు సూచించారు. గుంటూరులో భాష్యం విద్యాసంస్థల విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. భాష్యంలో చదవి జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాల్లో అఖిలభారత స్థాయి ఓపెన్ కేటగిరీ 5, 10వ ర్యాంకు సాధించిన విద్యార్థులను మాజీ ఉపరాష్ట్రపతి సన్మానించారు. ఇష్టపడి, కష్టపడి చదవాలన్నారు. కులాల కుమ్ములాటలో యువకులు దూరవద్దని సూచించారు. చదువు ర్యాంకులు కోసం కాదని... విజ్ఞానం, వివేకం పెంచుకోవడానికి అని వెంకయ్య నాయుడు అన్నారు.

హైదరాబాద్‌లోని DSE కార్యాలయం ముందు విద్యావాలంటీర్లు ఆందోళనకు దిగారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వాలంటీర్లు రెన్యూవల్ చేయాలని నినదించారు. 2020 సంవత్సరం నుంచి రెన్యూవల్ చేయలేదని మండిపడుతున్నారు. కార్యాలయం గేటు ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యావాలంటీర్ల ఆందోళనకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మద్దతు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ మొదలైంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీడ్రా కొనసాగుతోంది. కలెక్టర్లు, ఎక్సైజ్ ఉన్నతాధికారులు, పోలీసు, ప్రత్యేక అధికారుల సమక్షంలో అన్ని జిల్లాకేంద్రాల్లో ఈ లక్కీడ్రా కొనసాగుతోంది. మండలాలు, దుకాణాల ప్రాతిపదికన బహిరంగంగా డ్రా తీస్తున్నారు. మొత్తం 2,620 షాపులకు 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. డ్రాలో వచ్చిన పేర్లు వెంటనే అధికారులు ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో లక్కీడ్రా ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ హజరై ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

అలిపిరి-తిరుమల నడక మార్గంలో ఎలుగుబంట్ల సంచారం కొనసాగుతోంది. టీటీడీ అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ సీసీ కెమెరాల్లో వీటి సంచారం రికార్డయింది. నడక మార్గంలో ఏడో మైలు వద్ద పెట్టిన కెమెరాల్లో శుక్రవారం, శనివారం అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి కనిపించింది. ఆదివారం సాయంత్రం నరసింహస్వామి ఆలయం సమీపంలోనూ ఎలుగుబంటి సంచారం గుర్తించారు. సిబ్బందిని అప్రమత్తం చేసిన అటవీశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

తక్షణం అగనంపూడి టోల్ గేటును తొలగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో టోల్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనేక ఏళ్లుగా అక్రమంగా, చట్టవిరుద్ధంగా అగనంపూడి టోల్ గేట్ కొనసాగుతుందని సీపీఎం నాయకుడు గంగారావు అన్నారు. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో టోల్ గేట్లు ఉండకూడదనే నిబంధనలను కూడా ధిక్కరిస్తూ కేంద్రం ప్రజలను నిలువుదోపిడీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 25 సంవత్సరాల నుంచి దారి దోపిడి చేస్తున్నారని.. ఇప్పటి వరకు సుమారు 700 కోట్లకు పైగా వసూలు చేశారని విమర్శించారు.

నెల్లూరు జిల్లా కావలి జనతాపేట సౌత్ సాంఘీక సంక్షేమ హాస్టల్ వద్ద షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధమైంది. జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామానికి చెందిన ఓ కుటుంబం కావలిలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. కారులోంచి దిగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడి పైన ఉన్న విద్యుత్ తీగలను తాకటంతో అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది విద్యుత్‌ను నిలిపివేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఇవాళ భారీ వర్షం కురిసింది. భక్తులు, స్ధానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం చిన్న వెంకన్న ఆలయానికి వచ్చిన భక్తులు సైతం వర్షంలో తడిసిముద్దయ్యారు. మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొన్ని గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.

విశాఖలో వైసీపీ పెద్దల భూ దాహంపై మండిపడుతున్నారు స్థానికులు తర్లుపాడు గ్రామంలోని కోట్ల విలువైన భూమిని కారుచౌకగా ప్రభుత్వం నుంచి పొందేందుకు మాస్టర్ ప్లాన్ వేశారన్న నేపధ్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తర్లువాడ కొండపై ప్రసిద్ధ విష్ణుపాదాలు, దేవాలయం ఉందని వరాహ నరసింహ స్వామి మొదట ఇక్కడే వెలసి ఆ తర్వాత అడవివరం కొండపైకి వెళ్లినట్లు స్థానికులు అంటున్నారు. చారిత్రాత్మక నేపధ్యం ఉన్న ఈ విలువైన భూమి విజయసాయిరెడ్డికి కట్టబెడుతుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రైవేట్ వ్యక్తులు ఈ స్థలం ఆక్రమించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.

దశాబ్ధాలుగా హైదరాబాద్ బోరబండ NRRపురం వాసులు ఎదురుచూసిన థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ సమస్యను తాము పరిస్కరించామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. హౌసింగ్ సొసైటీలో ఉన్న సుమారు 2వేల కుటుంబాలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ జీవో 96 ఇటీవల విడుదలైందని తెలిపారు. దీనివల్ల క్రయ విక్రయాలు జరుపుకొనే వారికి పూర్తి స్ధాయిలో ఎలాంటి ఫీజులు లేకుండా రిజిస్ట్రేషన్ అవుతుందని ఎమ్మెల్యే మాగంటి అన్నారు.

హైదరాబాద్ అంబర్‌పేట్ నియోజకవర్గం బీఆర్ఎస్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పై మాజీ కార్పోరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. అంబర్‌పేట్ టికెట్ కాలేరు వెంకటేష్‌కు కేటాయించొద్దని అంటున్నారు. నియోజకవర్గ ప్రజలను కలుపుకోలేని ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చండి.. అంబర్‌పేట్‌ను కాపాడండి సీఎం గారు అంటు నిరసన గళమెత్తారు. అంబర్‌పేట్ అభ్యర్ధిని మారిస్తే పార్టీ విజయం కోసం కృషి చేస్తామని మాజీ కార్పోరేటర్లు అంటున్నారు.

జమ్మూకశ్మీర్‌లోని లద్దాక్‌లో జరిగిన ఆర్మీ ట్రక్కు ప్రమాదంలో తెలంగాణకు చెందిన జవాన్ మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తంగళ్లపల్లి పంచాయతీ పరిధిలోని తిర్మన్‌దేవునిపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయారు. జవాన్ స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నీరటి చంద్రశేఖర్ 2010లో ఆర్మీ జవానుగా సైన్యంలో చేరారు. చంద్రశేఖర్‌కు భార్య, నాలుగేళ్ల కొడుకు, రెండేళ్ల కూతురు ఉన్నారు.15 ఏళ్లకు గాను 13 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. మరో రెండేళ్ల తర్వాత సర్వీస్ పూర్తవుతుంది. అంతలోనే చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయారు.

టీడీపీ నాయకులు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. యువగళం 189వ రోజు పాదయాత్ర నిన్న విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి నిడమనూరు వరకు సాగింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర ఇవాళ తెల్లవారుజాము వరకు సాగింది. సుమారు 12 గంటలు నిర్విరామంగా 16 కిలోమీటర్ల వరకు పాదయాత్ర సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అర్ధరాత్రి దాటాక కూడా పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు వేచి ఉండటంతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ లోకేష్ ముందుకు సాగారు.

నీట్ పరీక్షలో మినహాయింపు ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. నీట్ వ్యతిరేక బిల్లుకు సంతకం చేసేదిలేదన్న గవర్నర్ ఆర్‌ఎన్ రవి తీరుపైనా స్టాలిన్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేశారు డీఎంకే నేతలు, కార్యకర్తలు. నీట్ రద్దు చేయాలంటూ మంత్రి ఉదయనిధి నేతృత్వంలో నిరాహార దీక్ష జరిగింది. నీట్ పరీక్షలో తమ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. నీట్ వల్ల పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న ఆయన... దీనిపై ఢిల్లీలోనూ పోరాటం చేస్తామన్నారు.

నిర్మల్ జిల్లాలో నూతన మాస్టర్ ప్లాన్ తీవ్ర దుమారం రేపుతోంది. 220 జీవో రద్దు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్షను ఆర్ధరాత్రి భగ్నం చేశారు పోలీసులు. గత 5 రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు. షుగర్,బీపీ లెవల్స్ పడిపోవడంతో అరెస్ట్ చేసి.. నిర్మల్ ఏరియా అస్పత్రికి తరలించారు. అయితే మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు తన పోరాటం ఆగదన్న మహేశ్వర్‌రెడ్డి అస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏరియా అస్పత్రికి భారీగా చేరుకుంటున్న బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 189వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. లోకేష్‌కు మద్దతుగా యువగళానికి జనం భారీగా తరలివచ్చారు. దారి పొడవునా లోకేష్‌కు స్థానికులు, టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. లోకేష్ కలిసిన వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. హైస్కూల్ రోడ్, ఆటోనగర్, కానూరు, తాడిగడప, పోరంకిల మీదుగా యాత్ర సాగనుంది. నిడమానూరు దగ్గర గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. రాత్రికి నిడమానూరులో లోకేష్ బస చేస్తారు. దాదాపు 15 కిలో మీటర్లపైనే అర్ధరాత్రి వరకు పాదయాత్ర సాగనుంది.

అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు వైజాగ్ నుంచి పాడేరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ చెట్టుకొమ్మను తప్పించబోయి..స్టీరింగ్‌ను పక్కకు తిప్పడంతో లోయలోకి దూసుకెళ్లింది. అమ్మవారి పాదాలు, వ్యూపాయింట్ దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలువురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఐదవ రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన సీఐ పురుషోత్తంను సస్పెండ్ చేయాలంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసుల్ని ఇంట్లోకి రానీవ్వకుండా ఇంటి గేటు ఎదుట కార్యకర్తలు పెద్ద ఎత్తున బైటాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడి నుండి వెనుదిరిగారు.

హైదరాబాద్‌లో మరో బెగ్గింగ్ ముఠా గుట్టురట్టయింది. అనాథ గృహాల ఫౌండేషన్ పేరుతో...కూడళ్ల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్, మలక్‌పేట్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో బెగ్గింగ్ ముఠా పట్టుబడింది. అమ్మ చేయూత ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గణేష్, రవి, మంగు... ఇద్దరు ఏజెంట్లను నియమించుకొని వసూళ్లకు తెరలేపారు. అంతేగాకుండా సంస్థ నిర్వాహకులు సమాజ సేవ కోసం ఏడుగురు యువతులను నియమించుకొని ఫౌండేషన్ పేరిట డబ్బు వసూళ్లు చేయించారు. కలెక్షన్ బాక్సులను తయారు చేయించి.. వాటిని అద్దెకు ఇచ్చినట్టు గుర్తించారు.

సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నూతన మెడికల్ కాలేజ్ భవనం, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించారు. కాసేపట్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తర్వాత ప్రగతి నివేదన సభలో పాల్గొంటారు. కొత్త మార్కెట్ యార్డు వెనకాల 50 ఎకరాల స్ధలంలో దాదాపు లక్ష మందితో సూర్యాపేట ప్రగతి నివేదన సభ తలపెట్టారు. దీని కోసం భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

జగన్ పాలనలో రవాణారంగం కుదేలయ్యిందని విమర్శించారు నారా లోకేష్.. యువగళం పాదయాత్రలో భాగంగా విజయవాడ ఆటోనగర్ కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు నారా లోకేష్.. ఎంతో చరిత్ర ఉన్న విజయవాడ ఆటోనగర్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేశారని ...కార్మికుల పోరాటంతోనే జగన్ వెనక్కి తగ్గారన్నారు. అధికారంలోకి వచ్చాక రవాణారంగానికి పునర్‌వైభవం తీసుకొస్తామని చెప్పారు. మరమ్మతుల పేరుతో జగన్ ప్రభుత్వం వ్యాట్ పెంచింది కానీ.. ఒక్క రోడ్డుకు కూడా మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని పనులను ప్రక్షాళన చేస్తామన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం మాతాశిశు కేంద్రంలో గర్భిణి మృతితో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టేకులపల్లి మండలం మొక్కంపాడు తండాకు చెందిన గర్భిణి..14 రోజుల క్రితం డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరింది. అర్ధరాత్రి బ్లీడింగ్ అధికమవడంతో చనిపోయిందని సిబ్బంది చెప్పారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ బిడ్డ పరిస్థితి బాగాలేదని ఎన్ని సార్లు చెప్పినా డాక్టర్లు పట్టించుకోలేదని మృతదేహాన్ని కూడా చూపించకుండా మార్చురీకి తరలించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి మండలం నల్లగుట్ల పొలాల వద్ద ఈ విషాద ఘటన జరిగింది. ఏనుగు మృతిపై అటవీ అధికారులకు రైతులు సమాచారం అందించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం దగ్గర టెన్షన్ కొనసాగుతోంది. జేసీ ఇంటి ముందు ప్రభుత్వ కాలేజీ ప్రహరీ గోడ నిర్మాణం వివాదాస్పదంగా మారింది.. పునాదుల కోసం తవ్విన గోతులను గుర్తుతెలియని వ్యక్తులు.. రాత్రికి రాత్రే పూడ్చేశారు. మరోవైపు జేసీ ఇంటికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు.. ఘటనాస్థలంలో 30 యాక్ట్ అమలులో ఉందని చెబుతున్నారు. టీడీపీ నేతలపై కక్షలో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు పనులు చేపట్టారని జేసీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈ నెల 26న చేవెళ్లలో జరగనున్న బహిరంగ సభతో పాటు పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ విడుదల చేయనుంది. ఈ నెల 29న వరంగల్‌లో మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేయాలని తెలంగాణ నేతలు భావిస్తున్నారు.ఆ తర్వాత మహిళా డిక్లరేషన్ కూడా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు టీ కాంగ్ నేతలు . ఇక మహిళా డిక్లరేషన్ విడుదలకు ప్రియాంక గాంధీని ఆహ్వానించనున్నారు.

విశాఖ జిల్లా పెందుర్తి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆలయంలో భారీ చోరీ జరిగింది. నూకాలమ్మ ఆలయంలో పట్టపగలు దొంగతనం జరగడం చర్చనీయాంశంగా మారింది. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఉన్న వెండి కిరీటం, 40 తులాల బంగారంతోపాటు పంచపాత్ర ఇతర వస్తువులు చోరీ అయ్యాయి. ఆభరణాల్ని సంచిలో వేసుకొని దొంగ తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చోరికి సంబంధించి పెందుర్తి పీఎస్‌లో ఆలయ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

అధికార బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్‌కు మరో కొత్త తలనొప్పి మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్ గొడవ జరుగుతుంటే.. ఇప్పుడు భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ విషయం కూడా రచ్చకెక్కింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ ఇవ్వొద్దని తెలంగాణ ఉద్యమకారులు పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇల్లందు బీఆర్ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు టికెట్ ఇవ్వొద్దని నిర్ణయించారు. హరిప్రియకు కాకుండా ఇతరులకు ఇవ్వాలని తీర్మానిస్తూ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు ఇంట్లో ఈ భేటీ జరిగింది. 5మండలాలకు చెందిన అసమ్మతి నేతలు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు వ్యతిరేకంగా గళం వినిపించారు.

కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. తలకుగాయాలతో వచ్చిన యువకుడిపై లాఠీ ఝులిపించాడు. కనీసం కనికరం చూపకుండా దారుణంగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ యువకుణ్ని లాఠీతో కొట్టిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి. సతీష్ ఇంట్లో గొడవ జరగడంతో అతనికి తలకు గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు 100కు డయల్ చేయడంతో....పోలీసులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ యువకుడితో గొడవపడ్డ కానిస్టేబుల్ సత్యనారాయణ లాఠీతో ప్రతాపం చూపారు.

ముషీరాబాద్ భోలక్‌పూర్‌లో భారీ పేలుడు సంభవించింది. అంజుమన్ స్కూల్ సమీపంలోని స్టీల్ స్క్రాప్ దుకాణంలో కెమికల్ బాక్స్ పేలింది. ఈ ఘటనలో గౌసిద్దిన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శరీరం పూర్తిగా కాలిపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. పేలుడుకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

మంత్రి కేటీఆర్‌కు కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలు... చూసేది బీఆర్‌ఎస్ నేతలు అంటూ కామెంట్ చేశారు. గిరిజన మహిళపై పోలీసులు దాడి చేస్తే సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బాధ్యులపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో దళితులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్‌లో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. కనీసం సమావేశానికి ఉన్నతాధికారులను కూడా పంపడం లేదని ఆరోపించారు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన దిశా సమావేశం నిర్వహించారు.. సమావేశంలో హైదరాబాద్‌లోని పాఠశాలలో వసతుల కల్పనపై చర్చించారు.. కొన్ని పాఠశాలలకు విద్యుత్ సరఫరా నిలిపివేతపై కిషన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగొద్దన్నారు. దిశా మిటింగ్‌కు హాజరుకాని అధికారులపై కేంద్రానికి లేఖ రాస్తానని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


