చిట్టి న్యూస్

ఆ రైలులో తమిళులు ఎవరూ లేరు

ఒడిశా రైలు ప్రమాదంలో తమిళులు ఎవరూ చనిపోలేదన్నారు మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఆసుపత్రిలో ఎవరూ అడ్మిట్ కాలేదన్నారు. అన్ని ఆసుపత్రులను పరిశీలించామన్నారు.

రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి

ఒడిశా రైలు ప్రమాద స్థలంలో ఓ ట్రాక్‌పై పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించారు. దీంతో ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.


Telangana: నేటి నుంచి రేషన్ డీలర్ల సమ్మె

తెలంగాణలో రేషన్‌ డీలర్ల  సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు గౌరవ వేతనం ఇవ్వాలని, హమాలీ ఛార్జీలు భరించాలని డిమాండ్‌ చేశారు. ఇక 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. డీలర్ల సమ్మెతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ పంపిణీ నిలిచిపోనుంది.

కందుకూరు వైసీపీలో వర్గపోరు

కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరు  వైసీపీలో వర్గపోరు నడుస్తుంది. వైసీపీ పార్టీకి చెందిన ఇరు వర్గాలు కత్తులు కర్రలతో ఘర్షణకు దిగారు. గత నాలుగు సంవత్సరాల నుండి బెట్టన్న గౌడ్, రాజోలి బండ భీమారెడ్డి వర్గీయులకు పచ్చగడ్డి వేస్తే భగ్గమన్నట్లు ఘర్షణలు జరుగుతున్నాయి. రాజకీయంగా ఎదుర్కొన లేకనే మాపై దాడులకు దిగారంటూ ఆరోపిస్తున్నారు భీమారెడ్డి వర్గీయులు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇరు వైసీపీ వర్గీయులను ఆదోని ఆస్పత్రికి తరలించారు.

Telangana: రైతులకు ప్రభుత్వం ఎంతో గౌరవం తెచ్చిందది: ఎమ్మెల్సీ కవిత

రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో గౌరవం తెచ్చిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ద‌శాబ్ది వేడుక‌ల్లో భాగంగా స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌లం ప‌ద్మాజివాడ‌లో నిర్వహించిన రైతు దినోత్సవంలో పాల్గొన్న కవిత... ఉమ్మడి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చూశామన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. మిష‌న్ కాక‌తీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నామ‌ని.. దీంతో భూగ‌ర్భ జ‌లాలు కూడా పెరిగాయ‌న్నారు. ఇక కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులను త్వరలోనే ప్రారంభిస్తామ‌ని చెప్పారు. వరిసాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింద‌న్నారు కవిత.

విశాఖ నుంచి ఒడిశాకు వెళ్లిన వైద్య సిబ్బంది

విశాఖ నుంచి ఒడిశాకు డీఆర్ఎం స్పెషల్ ట్రైన్‌ బయల్దేరింది. వైద్య సిబ్బందితో బయల్దేరిన ఈ ట్రైన్.. ఏడుగంట్లో ప్రమాద స్థలానికి చేరుకుంటుంది. ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ అలెర్ట్‌ అయ్యిందని విశాఖ స్టేషన్ డైరక్టర్‌ వెంకటరాజు అన్నారు. విశాఖ నుచి వైద్య సిబ్బంది, సహాయక పరికరాలు పంపించామంటున్నారు.

లోకేష్‌కు ప్రాణహాని

యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్‌కు రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో ప్రాణహాని ఉందన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాసామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయన్నారు వర్ల రామయ్య. రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో లోకేష్ కు ప్రాణహాని ఉందని, అనేకమార్లు డీజీపీ దృష్టికి తీసుకొచ్చామని గుర్తు చేసారు. సంబంధిత అధికారుల ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేసారు వర్ల రామయ్య.

వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు

తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి. వ్యవసాయాన్ని పండగలా చేయాలన్న నినాదంతో, సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ, దశాబ్ధి ఉత్సవాల్లో, మొట్టమెదటి రోజు రైతు దినోత్సవాన్ని జరుపుకున్నామన్నారు శాంత కుమారి. అకాల వర్షాలు వడగళ్ల వాన నుండి పంట నష్టపడకుండా, ఉండాలంటే రైతులు రెండు మూడు వారాల ముందే నార్లు వేయాలన్నారు. ఎరువులను దఫ దపాలుగా వాడితే అధిక దిగుబడి వస్తుందన్నారు శాంత కుమారి.

నిలిచిపోయిన 17 రైల్లు

ఒడిశా ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న నేపథ్యంలో ఈస్ట్‌ కోస్ట్‌లో 17 ట్రైన్స్‌ నిలిచిపోయాయి. 11 రైళ్లను దారి మళ్లించారు. ఇందులో విజయనగరం మీదుగా ప్రయాణించే నాలుగు ట్రైన్స్‌తో పాటు మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు. అదేవిధంగా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయనగరం జిల్లా గుండా ప్రయాణించడంతో స్థానిక రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. 

ఒడిశాలో రైలు ప్రమాదం

కోల్‌కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొట్టింది.దీంతో ఇంజిన్‌తో పాటు 12 బోగీలు పక్క ట్రాక్‌పై ఒరిగిపోయాయి. ఇదే సమయంలో ఆ ట్రాక్‌పై యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. యశ్వంత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగు జనరల్‌ బోగీలు ధ్వంసం అయ్యాయి. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌లు ధ్వంసం అయ్యాయి. ఇంజిన్‌తో పాటు పట్టాలు తప్పిన B1 బోగీ. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. 

తెలంగాణ భవన్‌ ఆవరణలో యువతి ఆత్మహత్యాయత్నం

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కలకలం రేగింది. శేజల్‌ అనే యువతి ఆత్మహత్యా యత్నం చేసింది. తెలంగాణ భవన్‌ పార్కింగ్‌లో విషం తాగింది. దీంతో గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య.. లైంగికంగా వేధించాడంటూ గతంలో ఆమె ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌, జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేపట్టింది.

రోడ్డు ప్రమాదం లో రెండేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌ లో విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మన్సూరాబాద్‌-ఎల్బీనగర్‌ మార్గంలో రోడ్డుపై కారు ఆపిన డ్రైవర్‌.. హఠాత్తుగా కారు డోర్‌ తీశాడు. అదే సమయంలో అటుగా వచ్చిన బైక్‌కు కారు డోర్‌ తగిలింది. దీంతో బైక్‌పై ఉన్న దంపతులు సహా చిన్నారి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి ధనలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాప తల్లిదండ్రులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలంగాణదశాబ్ది వేడుకలపై కేటీఆర్‌ ట్వీట్‌

తెలంగాణదశాబ్ది వేడుకలపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. పోరాట యోధుడే పాలకుడై..సాధించిన తెలంగాణను..సగర్వంగా దేశంలోనే..సమున్నతంగా నిలిపిన వేళ దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకుంటోందని ట్వీట్‌ చేశారు.

తెలంగాణ, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచి దశాబ్ది వేడుకలు జరుపుకుంటోందని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం కేసీఆర్‌ సారథ్యంలో బంగారు తెలంగాణకు బాటలు పడి ఉద్యమ ఆకాంక్షలైన "నీళ్లు, నిధులు, నియామకాలు" నెరవేరి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అనుభవంలోకి వచ్చాయని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

జగన్‌ ప్రారంభించిన వెంటనే ట్రాక్టర్‌ ఆగిపోయింది

గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్ధం చెప్పే రోజు ఇది అని సీఎం జగన్ గొప్పలు చెప్పారు.గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేశారు.ఆర్భాటంగా వైఎస్సార్ యంత్ర సేవా పథకం కార్యక్రమంలో జెండా ఊపి ట్రాక్టర్లను ప్రారంభించారు.అయితే జగన్‌ప్రారంభించిన వెంటనే ఓ ట్రాక్టర్‌ ఆగిపోయింది.మధ్యలో సెల్ఫ్‌ ఆగిపోవడంతో మోరాయించింది. మరోవైపు గేరు పడక లబ్ధిదారులు కష్టాలు పడ్డారు.

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఘనంగా  దశాబ్ది ఉత్సవాలు

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంధా జగన్నాథం, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ అమరవీరుల స్థూపానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ అవతరణ మామూలుగా సాధించిన విజయం కాదన్నారు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంధా జగన్నాథం. "తెలంగాణ ఆచరిస్తుంది...దేశం అనుసరిస్తుంది" అన్న స్థాయికి చేరుకోవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని చెప్పారు.

ఉజ్జయిన్‌లో  సారా అలీఖాన్‌ సందడి

మధ్య ప్రదేశ్‌ ఉజ్జయిన్‌లో బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌ సందడి చేసింది. ఉజ్జయిన్‌ మహాకాళేశ్వర్‌ ఆలయంలో పూజలు నిర్వహించింది. మిగతా భక్తులతో కలిసి సాధారణ భక్తురాలిగానే సారా అలీ ఖాన్‌ దేవుడిని పూజించింది. మహాకాళేశ్వరుడికి అభిషేకం చేసింది.

ఏపీ ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల అల్టిమేటం

ఏపీ ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అల్టిమేటం జారీ చేసింది. తక్షణమే 8 డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. జూన్ 9 నుంచి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని తెలిపారు.

ప్రశ్న పత్రాల లీకేజీ కేసు, అరెస్టైన 37మంది డిబార్

TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్‌ ఇప్పటివరకు అరెస్ట్‌ చేసిన 37 మందిని డిబార్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట

ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణా హైకోర్టులో ఊరట లభించింది. అతడికి ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ  చేసింది. అవినాశ్ కు షరత్తులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. 


తడిసిన ధాన్యం, రైతుల ఆందోళన

జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు గడిచినా ఇంకా తూకం జరగలేదని ఆరోపించారు. ఐకేపీ సెంటర్‌లో వర్షాలకు వరి ధాన్యం మొలకలెత్తాయి.

తమ్మినేని వ్యాఖ్యలపై మండిపడుతున్న తేదేపా

చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలకు నిరసిస్తూ శ్రీకాకుళంలో టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తమ్మినేని సీతారాం దురహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

రాష్ట్రపతిని కలిసిన ఖర్గే బృందం

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం కలిసింది. మణిపూర్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని జైరాం రమేష్ కోరారు.

సిసోడియా కు చుక్కెదురు

ఆప్ నేత మనీష్‌ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఆరోపణలు తీవ్రమైనవని.. బెయిల్‌ ఇవ్వలేమని స్పష్టం చేసింది. 

మద్యం మత్తులో దారుణం

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఎంఎస్ఎస్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది.  మద్యం మత్తులో ఓ తండ్రి రెండేళ్ల తన కూతురిని నేలకేసి కొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.   

కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యురాలు రాకపోవడంతో గర్బిణీకి నర్సులు డెలవరీ చేయగా శిశువు మృతి చెందింది. నర్సుల నిర్లక్ష్యానికే చిన్నారి మృతి చెందిందని బాధితులు ఆందోళన చేపట్టారు.

పతాకాలను గంగలో కలిపేస్తాం....
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. తమ ఆరోపణలపై తగిన చర్యలు తీసుకోకపోతే తమ పతాకాలను గంగలో విసిరేసి, ఆమరణ నిరాహార దీక్ష చేపడతామంటూ రెజ్లర్లు హెచ్చరించారు. ఈ మేరకు సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్, భజరంగ్ పునియా తమ ట్విట్టర్ ఖాతాల్లోనూ పోస్ట్ చేశారు. 
జమ్మూలో ఘోర ప్రమాదం

జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్జర్ కోట్లీ వద్ద బ్రిడ్జిపై నుంచి బస్సు లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

వానల కోసం కాస్త ఆగాల్సిందే మరి...

నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యం కానుంది. జూన్‌ 4న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. అరేబియా సముద్రంలో నైరుతి గాలుల వేగం పెరగడమే ఇందుకు కారణమని ఐఎండీ తెలిపింది. 

ఫేక్ కాల్స్ కలకలం

సిద్దిపేట జిల్లాలో ఫేక్ ఫోన్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. స్థానిక ఎస్సై పేరుతో డబ్బులు పంపించాలని కొందరు అగంతకులు.. ఇంటర్‌నెట్‌, మినీ బ్యాంక్ నిర్వాహకులకు బెదిరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రాజంపేటలో రైతుల ధర్నా

అన్నమయ్య జిల్లా రాజంపూట ఆర్డీఓ కార్యాలయం ఎదుట దళిత రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు. 2005లో తమకు కేటాయించిన భూములను పంపిణీ చేయాలని దళితులు డిమాండ్ చేశారు. 

హస్తం పార్టీవైపే గాలి వీస్తోందా!

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. జూన్ 8న జూపల్లి, ఈనెలాఖరు లోపు పొంగులేటి కాంగ్రెస్‌ గూటికి వెళ్తారని అనుచరులు అంటున్నారు.

ఏపీ ఉద్యోగ సంఘాల నిరాహార దీక్ష

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమాన్ని ఉద్దృతం చేశారు. ఇవాళ నిరాహార దీక్షలు చేయనున్నారు. నిన్న సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు.. 160 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. 

నిలిచిపోయిన భూ రిజిస్ట్రేషన్లు

ఏపీ వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా సోమవారం నుంచి సర్వర్లు మొరాయించడంతో ల్యాండ్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ఆయా కార్యాలయాల వద్ద జనం పడిగాపులు పడుతున్నారు.

జమ్మలమడుగులో యువగళం

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఇవాళ్టి నుంచి కొనసాగునుంది. 4 రోజుల విరామం తర్వాత 111వ రోజు జమ్మలమడుగు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. సాయంత్రం జమ్మలమడుగులో లోకేష్ భారీ బహిరంగ సభ జరగనుంది.

మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన కేటీఆర్

రెజ్లర్లకు మద్దతుగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బాధ్యతగల నాయకులెవరైనా ఈ ఘటనకు సమాధానం చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. రెజ్లర్ల అరెస్ట్‌లను ఖండిస్తూ ఆయన ఘాటుగా ట్వీట్ చేశారు. రెజ్లర్ల అరెస్ట్‌పై నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రపంచ వేదికపై దేశానికి కీర్తి తెచ్చిన ఛాంపియన్లకు మద్దతివ్వాలని, వారిని గౌరవించాలని ట్వీట్ చేశారు. రెజ్లర్ల అరెస్ట్‌ని, వారి నిరసనపై ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. 

నింగిలోకి దూసుకెళ్లిన GSLV F12

షార్‌ నుంచి మరో రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. GSLV-F12 వాహకనౌక NVS-01 ఉపగ్రహాన్ని తీసుకెళ్లింది. ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రయోగం సక్సెస్‌ అయినట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు. GSLV-F12 పొడవు 51.7 మీటర్లు. బరువు 420 టన్నులు. నావిక్‌ ఉపగ్రహాల్లో NVS-01 మొదటిది. 2వేల 232 కిలోల బరువున్న దీని జీవితకాలం 12 ఏళ్లు. ఈ ఉపగ్రహం భారత్‌ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1,500 కిలోమీటర్ల పరిధిలో రియల్‌ టైమ్‌ పొజిషనింగ్‌ సేవలను అందిస్తుంది.