- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

తెలంగాణలో బీజేపీకి 70 సీట్లు ఖాయమని ఎంపీ అర్వింద్ చెప్పారు. సీట్లు తగ్గినా ఏర్పడేది తమ ప్రభుత్వమేనన్నారు. ధాన్యం కొనుగోళ్లలో చేసిన అవినీతి, అక్రమాలతో బీఆర్‌ఎస్ మళ్లీ గెలవాలని చూస్తోందని అర్వింద్ ఆరోపించారు. ధాన్యం సేకరణలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి బీఆర్‌ఎస్ పార్టీ 40 కోట్లు ఇస్తోందని అన్నారు. ఏమైనా రాష్ట్రంలో ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఎంపీ అర్వింద్...భీంగల్ మండలం లింగాపూర్‌లో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

టీటీడీ పాలకమండలిలో జైలుకు వెళ్లి వచ్చిన వారికి చోటు కల్పించడం అపచారమన్నారు...రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. ఆర్ధిక నేరాలలో కూరుకుపోయి బెయిల్‌పై ఉన్న వారిని టీటీడీ సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ స్వప్రయోజనాల కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు బోర్డులో చోటు కల్పించడం సరికాదన్నారు. ఏపీకి చెందిన వ్యక్తులను మాత్రమే బోర్డు సభ్యులుగా నియమించేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలన్నారు.

ఎన్నికల్లో పోటీ చేస్తానన్న తుమ్మల ప్రకటనతో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ హైకమాండ్ జిల్లాల్లోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తుమ్మల రాజకీయ పయనం ఎటువైపు ఉంటుందన్న చర్చ ఊపందుకుంది. తుమ్మల పార్టీ మారుతారా.. ఏ పార్టీలోకి వెళ్తారు..? స్వతంత్రంగా బరిలో నిలుస్తారా అనే అంశాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేస్తానన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

నాగార్జునసాగర్ బీఆర్‌ఎస్‌లో అసమ్మతి చిచ్చు చల్లారడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు టికెట్ కేటాయించడంతో అసమ్మతి వాదులు భగ్గుమంటున్నారు. త్రిపురారం మండలం, పెద్దదేవలపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ ఇంట్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి యాదవ సంఘం నాయకులతో పాటు రామ్మూర్తి యాదవ్ కుమారుడు కోటేష్ కూడా హాజరయ్యారు. నాగార్జున సాగర్ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక యాదవులకే టికెట్ కేటాయించాలని అధినేత కేసీఆర్‌ను కోరుతున్నారు.

సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అప్పు చేసి పేదలకు డబ్బులు ఇచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. పన్నులు రూపేణా రెట్టింపు దండుకోవటం సంక్షేమ పాలనా అని ప్రశ్నించారు. జగన్ నొక్కే బటన్‌కు కరెంట్ లేదు... ఆ బటన్ ఎన్నిసార్లు నొక్కినా డబ్బులు పడవన్నారు. జగన్ చర్యలతో ఏపీ పరువుపోయిందన్నారు. ఏపీలో ఎక్కడ చూసిన భూ కబ్జాలు, మట్టి దోపిడీనే ఉందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం గెలుపు అనివార్యమని చెప్పారు. నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామస్తులతో లోకేష్ రచ్చబండ నిర్వహించారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆశావహులు పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 52 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా నిజామాబాద్ అర్బన్‌లో 12 మంది, బాన్సువాడ టికెట్ కోసం 12 మంది ఆశావహులు పీసీసీకి దరఖాస్తు చేశారు. జిల్లాలో ఒక్క చోట కూడా మహిళలు దరఖాస్తు చేయడానికి ముందుకు రాలేదు.

తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తమ ప్రభుత్వం రాగానే రెండు లక్షల రుణమాఫీపై తొలి సంతకం పెడతామన్నారు. నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్ నేతలు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప... 9 ఏళ్లలో జిల్లాకు ఏమీ చేయలేదన్నారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. వెలుగుపల్లికి చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.

వికారాబాద్ జిల్లా పరిగిలో కాసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేగా జాబ్ మేళాను నిర్వహించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ మేళాను ప్రారంభించారు. జాబ్ మేళాకు నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువతి, యువకులు భారీగా తరలివచ్చారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు మేళాలో పాల్గొన్నారు. నిరుద్యోగుల అర్హతలకు సంబంధించిన ఉద్యోగాలను ఆఫర్ చేశారు. జాబ్‌మేళా అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కాసాని వీరేష్ పిలుపునిచ్చారు. పరిగి ప్రాంతంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందన్నారు. వందకుపైగా కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం మరో మైలురాయికి చేరుకుంది. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం పోతిరెడ్డిపల్లిలో 195వ రోజు ప్రారంభమైన పాదయాత్ర... ముసునూరు మండలం సింహాద్రిపురం వద్ద 2600 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగు నీరందిస్తామని చెప్పారు.

ఎన్నికల సర్వేలపై మీడియా చిట్‌చాట్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే- సీ ఓటర్ సర్వే పై స్పందిస్తూ నెల రోజుల్లో టీడీపీ గ్రాఫ్ మరింత పెరుగుతుందన్నారు. ప్రజలు అభిప్రాయాలు వెల్లడించడానికి ఇంకా భయపడుతున్నారని అన్నారు. ప్రజలు భయం వదిలి స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి ఉంటే సర్వేలో టీడీపీకి ఉన్న ఆదరణ ఏంటో మరింత క్లారిటీ వచ్చేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలను జగన్ ఎంతగా నమ్మించే ప్రయత్నం చేసినా టీడీపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని చంద్రబాబు అన్నారు. రానురాను ప్రభంజనంగా మారడం ఖాయమన్నారు.

రెండు నెలలుగా ఆకాశాన్నంటిన టమాట ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు సుమారు 10టన్నుల టమాటను తీసుకొచ్చారు. వేలంలో క్వింటాల్ టమాట వెయ్యి కంటే తక్కువ ధరే పలికింది. అయితే కిలోకి 10 రూపాయలు కూడా దక్కలేదని రైతులు వాపోయారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధిక దిగుబడి రావడంతో ధరలు పతనమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో వినయోగదారులు మాత్రం కిలో టమాట 40 రూపాయలు పెట్టి కొంటున్నారు.

TTD బోర్డు మెంబర్ పదవి లిక్కర్ కేసు నిందితుడికి ఇవ్వడంపై మండిపడ్డారు బీజేపీ నేత లంకా దినకర్. టీటీడీ అంటే పవిత్రతకు మారుపేరని.. పవిత్ర సంస్థ పాలకమండలిలో సభ్యులుగా నిందితుడా అంటూ మండిపడ్డారు. అన్యమత సంప్రదాయంలో కూతురి పెళ్లిచేసిన వ్యక్తికి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టిన సీఎం.. ఇప్పుడు పవిత్ర సంస్థ పాలకమండలిలో సభ్యులుగా లిక్కర్ నిందితుడికి కట్టబెట్టారని విమర్శించారు. రాజకీయ పునరావాసంలో భాగంగా పదవులు కట్టబెట్టారని, సీఎం సామాజికవర్గానికే అయిదో వంతు పదవులు కేటాయించారిని ఆరోపించారు.

విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది. బీఆర్‌టీఎస్ రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం వద్ద అదుపు తప్పి స్కూలు పిల్లలపైకి దూసుకెళ్లింది. ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల వైఫల్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమానికి ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ఇవాళ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టింది. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మొక్కలను నాటారు. ప్రాజెక్టు చుట్టూ స్ధానిక ప్రజాప్రతినిధులతో కలిసి 10 వేలకు పైగా మొక్కలు నాటారు.

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస రిజర్వాయర్ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. రాత్రి, తెల్లవారుజామున పులి సంచరిస్తుందని ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దొంగ ఓట్లపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసైనికులను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలను బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో జనసైనికులకు, పోలీసులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లను చేర్చింది వైసీపీ నాయకులే అని ఆరోపించారు. దొంగ ఓట్లు ప్రతిపక్షాల నిరాధారమైన ఆరోపణలన్న మంత్రులు రోజా, పెద్దిరెడ్డి వ్యాఖ్యాలకు ఏం సమాధానం చెబుతారని జనసైనికులు ప్రశ్నించారు.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సీపీఐ బలంగా నినదిస్తోంది. రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో బస్సు యాత్ర తుళ్లూరుకు చేరుకుంది. వీరికి అమరావతి రైతులు ఘనంగా స్వాగతం పలికారు. రాజధాని లేక నడిరోడ్డున నిలబడ్డ ఆంధ్ర జాతికి.. తమ బ్రతుకు ముడుపును కట్టి 34 వేల ఎకరాల భూమిని త్యాగం చేసి.. రైతులు దగాపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు యాత్ర సందర్భంగా రాష్ట్రాన్ని కాపాడండి.. దేశాన్ని కాపాడండి అంటూ నినదిస్తున్నారు.

తెలంగాణలో నేటి నుంచి వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు వర్షాలు కురిసే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

మదురై రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మృతి చెందారు. మరో 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మంటల్లో ఒకరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్యాంట్రీ బోగిలో సిలిండర్ పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐఆర్టీసీ స్పెషల్ ట్రైన్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఏపీలో అశేష జనాభిమానాన్ని చూరగొంటున్న తెలుగుదేశం పార్టీ.. ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేందుకు సరికొత్త కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనుంది. 45 రోజులపాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగనుంది. ప్రతి ఒక్క ఇన్‌ఛార్జ్ ప్రతి ఇంటిని టచ్ చేసేలా కొత్త కార్యక్రమం రూపకల్పన జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి వారానికి ఐదు రోజులపాటు ఇందులో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఇప్పటికే బాదుడే బాదుడు- ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు పూర్తి చేసిన టీడీపీ..
మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంపై ఇవాళ్టి విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు టీడీపీ నేతలకు దిశానిర్థేశం చేయనున్నారు.
అటు.. ఇండియాటుడే- సీ ఓటర్ సర్వేలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడైంది. ఐతే.. ఏపీలో క్లీన్ స్వీప్ చేసే దిశగా టీడీపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే చంద్రబాబు సభలకు అశేష ప్రజాధరణ కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో.. అత్యధిక స్థానాలు వస్తాయన్న అంచనాలో చంద్రబాబు ఉన్నారు.

ప్రపంచానికే భారత్ దిక్సూచిగా మారుతోందన్నారు ప్రధాని మోదీ. ఇస్రో శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ నేరుగా బెంగళూరు వచ్చారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో హెడ్ క్వార్టర్స్‌కు ప్రధాని వెళ్లారు. ఇస్రో సెంటర్‌లో ఉద్వేగానికి గురైన మోదీ చంద్రయాన్-3లో పాల్గొన్న శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో ఛైర్మన్, మిషన్ డైరెక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు. చంద్రయాన్-3 ప్రయోగం ఎలా సాగిందో ఇస్రో ఛైర్మన్ ప్రధానికి వివరించారు. ఆదిత్య మిషన్, గగన్‌యాన్‌పై ప్రధాని ఆరా తీశారు.

చంద్రబాబు అధ్యక్షతన నేడు పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. నేతలు ప్రజల్లోకి పెద్దఎత్తున వెళ్లేలా కార్యాచరణ ప్రకటించనున్నారు. సెప్టెంబరు 1 నుంచి 45 రోజులపాటు రాష్ట్రంలో ప్రతి ఇంటినీ సందర్శించేలా ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు. వచ్చే రెండు నెలల్లో 30 అసెంబ్లీ నియోజకవర్గాలను సందర్శించి రోడ్‌షోలు, బహిరంగ సభలు పెట్టేలా ప్రణాళికలు రచించబోతున్నారు.

విశాఖ జిల్లా పెందుర్తి మండలం గోరవల్లిలో విషాదం జరిగింది. అప్పులభారంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. గోరవల్లిలో సత్తిబాబు కిరాణం దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సత్తిబాబు కుమారుడు సంతోష్ కొద్దికాలంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడి అప్పులు చేశాడు. బాకీ వసూళ్ల కోసం సంతోష్ బైక్‌ను తీసుకెళ్లారు. అవమానంగా భావించిన సత్తిబాబు, ఆయన భార్య, కుమార్తె పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. తల్లి, తండ్రి మృతి చెందగా నీలిమ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారు అసంతృప్తి చెందొద్దన్నారు మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి. ప్రతి పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు. అందరికీ అర్హతలను బట్టి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. చేవెళ్లలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి బీసీ బంధు లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. తొలి విడతగా రంగారెడ్డి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 300 చొప్పున.. 2100 మంది లబ్ధిదారులకు 21 కోట్లు అందజేశామన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు.

నంద్యాల జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారి రాసలీలల వీడియో కలకలం రేపుతోంది. పని చేసే కార్యాలయాన్నే అడ్డాగా మార్చుకొని వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి రాసలీలలు అంటూ సామాజిక మాద్యమాలలో చక్కర్లు కొడుతుంది. ఆ అధికారి రాసలీలలను రహస్యంగా సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు స్థానికులు. తాజాగా ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి హిందూపూర్ బదిలీ అయిన అధికారి రాసలీలలు అంటూ చర్చ సాగుతోంది. ఇంతకూ ఆ అధికారి ఎవరూ, ఆ యువతి ఎవరు..ఏ డిపార్ట్‌మెంట్‌లో అన్నది తెలియాల్సి ఉంది.

గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ చర్చలపై రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య అగాధం ఉన్నట్లు నమ్మించిన కేసీఆర్..ఇప్పుడు రహస్య సమావేశంలో ఏం చర్చించారో చెప్పాలన్నారు. గవర్నర్‌ను బీజేపీ అధ్యక్షురాలు అంటూ విమర్శించిన కేసీఆర్ .. రాజ్‌భవన్‌కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య పొత్తు ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలన్నారు రేవంత్‌రెడ్డి. కలెక్టర్లను అడ్డుపెట్టుకుని కేసీఆర్ భూములు దోచుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

అధికార పార్టీపై సర్పంచులు తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం సి.కొడిగేపల్లి సర్పంచ్ కవిత వైసీసీపికి గుడ్‌బై చెప్పారు. సర్పంచ్‌గా గెలిచి సంవత్సరాలు గడుస్తున్నా... గ్రామానికి, ప్రజలకు ఏం చేయలేకపోతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తిప్పేస్వామి తమకు సముచిత స్థానం కల్పించడం లేదని ఆరోపించారు. ఆస్తులు అమ్ముకొని సర్పంచ్‌గా ఎన్నికైతే... కూలి పనికి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని రోదించారు. రాజీనామా పత్రాన్ని మంత్రి పెద్దిరెడ్డికి అందిస్తానని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తమపై కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని అవమానించిన వారికి బుద్ధి చెబుతానని అనడం.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షాలు నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందన్నారు. ప్రతిపక్ష నేతగా కాకుండా ఫ్యాక్షనిస్టులా చంద్రబాబుని కాల్చి చంపండి.. ఉరి వేయండి, చెప్పలతో కొట్టండంటూ.. జగన్ విద్వేష ప్రసంగాలు చేశారని లోకేష్ గుర్తు చేశారు.

తెలంగాణ బీజేపీ నేతలు ఖమ్మం దారి పట్టారు. ఈనెల 27న నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఖమ్మం ఏస్.ఆర్&బి.జి.ఎన్.ఆర్ కాలేజీ గ్రౌండ్‌లో లక్ష మందితో సభ నిర్వహిస్తామంటున్నారు. ఖమ్మం సభకు అమిత్ షా హాజరుకానుండటంతో బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.. ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉంది.. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన అమిత్ షా టూర్... ఎట్టకేలకు కన్ఫామ్ కావడంతో సక్సెస్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

తిరుపతి నుంచి అదిలాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వ్యాపించాయి.తిరుపతి జిల్లా వెంకటగిరి సమీపంలో ఏసీ కోచ్ పొగలు రావడంతో భయభ్రాంతులకు గుయ్యారు ప్రయాణికులు. అయితే అప్రమత్తంగా వ్యవహరించి..చైన్ లాగి రైలును నిలిపివేశారు.ప్రయాణికుల అప్రమత్తతతో భారీప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రైల్వేశాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సమస్యను గుర్తించి మరమత్తలు చేశారు. దీంతో 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది కృష్ణా ఎక్స్‌ప్రెస్.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు.ఆర్మూర్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు.కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. రైతులకు 3 గంటలే కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ కావాలా..24 గంటలు కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా ప్రజలే తేల్చుకోవాలని అన్నారు కవిత.నల్ల చట్టాలను తీసుకొచ్చిన బీజేపీ అవసరం తెలంగాణకు లేదన్నారు. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ అన్న కవిత..కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని అన్నారు.

మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత వెనిగండ్ల రాము ఫైర్ అయ్యారు. గంజాయి మత్తులో..బూతుల పంచాగంతో ఎమ్మెల్యే పదవి విలువ తీసేస్తున్నాడని అన్నారు.గుడివాడకు పట్టిన దరిద్రాన్ని ప్రజలు ఒక భరించాల్సిన అవసరం లేదని,సినిమాల్లో విలన్ పరిస్థితి నానికి పడుతుందని అన్నారు.లోకేష్ చేయ్యాల్సిందే చెపుతారని,నానిని తరిమికొట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు.లోకేష్ వ్యాఖ్యలకు కొడాలి నాని భయపడ్డాడని,జరగని పనులకు శంకుస్థాపనలు చేస్తూ..గుడివాడ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు.రాబోయే ఎన్నికల్లో ప్రజలు కొట్టే దెబ్బకు రాష్ట్రం నుంచి పారిపోక తప్పదని అన్నారు వెనిగండ్ల రాము.

చంద్రుడి పై ప్రగ్యాన్ చంద్రుడిపై పనిచేయడం మొదలుపెట్టింది.రోవర్ వీడియో విడుదల చేసింది ఇస్రో. ల్యాండర్ విక్రమ్ లోపలి నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ వాటికి ఉన్న ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపైకి చేరుకుని 14 రోజుల పాటు వాటిలో ఉన్న 5 కీలకమైన పేలోడ్‌ల ఆధారంగా పరిశోధన చేస్తాయి. చంద్రుడిపై వాతావరణం ఎలా ఉంది..చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టి, రాళ్లో ఎలాంటి రసాయనాలు, మూలకాలు ఉన్నాయి వంటి విషయాలను పేలోడ్‌లు పరిశోధించి ఆ సమాచారాన్ని భూమిమీదకు చేరవేస్తాయి.

ఇవాళ సుప్రీం కోర్టులో సీబీఐ వర్సెస్ శ్రీలక్ష్మి కేసు విచారణకు రానుంది. గనుల కేటాయింపుల్లో ఓబులాపురం మైనింగ్ కంపెనీకి లబ్ది కలిగించారని శ్రీలక్ష్మీపై సీబీఐ ఆరోపించింది. అయితే గతంలో శ్రీ లక్ష్మికి క్లీన్ చిట్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది సీబీఐ.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు శ్రీలక్ష్మి. జగన్ అక్రమాస్తుల కేసుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆమె. 2011లో శ్రీలక్ష్మిని అరెస్ట్ చేసింది సీబీఐ.పెన్నా సిమెంట్స్ కేసులో జగన్,ధర్మాన ప్రసాదరావు,పెన్నా ప్రతాప్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు అభియోగాలు ఎదుర్కొంటున్నారు శ్రీ లక్ష్మి.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉంది. రికార్డ్ స్థాయిలో గాంధీ భవన్‌కు దరఖాస్తులు అందుతున్నాయి. ఇప్పటి వరకు 723 మంది టికెట్ల కోసం అప్లికేషన్లు పెట్టారు. అటు.. ఇవాళ్టితో కాంగ్రెస్ దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. చివరి రోజు కావడంతో ఇవాళ భారీగా దరఖాస్తులు రానున్నాయి. ఒక్క ఇల్లెందు నియోజకవర్గం టికెట్ కోసమే 36 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నాల.. తదితర కాంగ్రెస్ అగ్రనేతలు అప్లై చేసుకున్నారు. ఇవాళ భట్టి, ఉత్తమ్, పద్మావతి తదితర నేతలు దరఖాస్తు చేయనున్నారు. రేపటి నుంచి దరఖాస్తుల పరిశీలించనున్నారు.

విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కారు. టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆధ్వర్యంలో గో బ్యాక్ సీఎం అంటూ నినాదాలు చేశారు. నాలుగేళ్ల పాటు కాలయాపన చేసి ఎన్నికలు సమీపిస్తున్న వేళ శంకుస్థాపనలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించకుండా శంకుస్థాపన ఎలా చేస్తారంటూ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


