- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

స్వామి భక్తిని చాటుకున్నారు ద్రవిడ యూనివర్సిటి అధికారులు.పదవి విరమణ కాలపరిమితి 65 ఏళ్ల పెంచడంతో ఉన్నతాధికారుల అత్యుత్సాహం చూపించారు. ఏకంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రిజిష్టార్ వేణుగోపాల్ రెడ్డి.కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఉన్నతాధికారులు సీఎం నామస్మరణ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విశ్వవిద్యాలయాలను రాజకీయ వేదికలుగా మారుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వద్ద మూడు రోజుల పాటు HCAలో క్రికెట్ అండర్ 16 బాయ్స్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. సెలక్షన్ ప్రక్రియకు ఒక్కో రోజు ఒక్కో జిల్లాకు ఇస్తే బాగుండేదని ప్లేయర్స్ అంటున్నారు. ఉదయం 6 గంటలకే స్టేడియం వద్దకు క్రికెటర్లు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. తమ పిల్లలు తిండి, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. HCA ఒక పద్ధతి ప్రకారం సెలక్షన్స్ నిర్వహించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

ప్రధాని మోదీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఒకే వేదికను పంచుకున్నారు. మహారాష్ట్రలోని పుణెలో మోదీకి 'లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు' ప్రధానం సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది. శరద్ పవార్ పార్టీ ఇటీవల రెండుగా చీలిన తర్వాత ఇద్దరూ కలుసుకోవడం ఇది మొదటిసారి. మోదీ కార్యక్రమంలో పవార్ పాల్గొనడం మంచి పరిణామం కాదని విపక్ష నేతలు పవార్‌కు సూచించినప్పటికీ ఆయన మోదీతో వేదికపంచుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇరువురు నేతలు వేదికపై సుమారు గంట సేపు ఉన్నప్పటికీ మాట్లాడుకోలేదని తెలుస్తోంది.

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలపై కేంద్రమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. పెద్దిరెడ్డి 60కి పైగా సూట్‌కేసు కంపెనీలు సృష్టించారని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్రయాదవ్ ఆరోపించారు. అన్ని రకాలుగా అక్రమాలు చేసి వేల కోట్లు దోచుకుంటున్నారని, 2019కి ముందు పెద్దిరెడ్డి ఆస్తులు 2019 అఫిడవిట్‌లో ఆస్తులను పేర్కొనలేదని చెప్పారు. ఎన్నికల సంఘాన్ని మోసం చేసిన పెద్దిరెడ్డిపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దుర్వినియోగంపై కూడా అమిత్ షాతో మాట్లాడినట్లు రామచంద్రయాదవ్ తెలిపారు.

లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించడం తనకు మధుర జ్ఞాపకమన్నారు ప్రధాని మోదీ. స్వాతంత్ర సమర యోధుడు తిలక్ 103వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీకి ఈ పురస్కరాన్ని ప్రదానం చేశారు. లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ మోదీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇక తిలక్ ఆధునిక భారత దేశ పిత అని మహాత్మాగాంధీ అభివర్ణించారని చెప్పారు మోదీ. స్వాతంత్ర్య సంగ్రామంలో తిలక్ పాత్రను ఏవో కొన్ని సంఘటనలు, మాటల ద్వారా వర్ణించలేమన్నారు.

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తెలంగాణ భవన్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ఈ ధర్నాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని వెంటనే ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. రైతుల్ని గాలికి వదిలేసి సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన వెళ్లారంటూ విమర్శిస్తున్నారు. చనిపోయిన వరద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలంటూ ఆందోళన చేశారు.

రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు భట్టి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్‌ను కోరారు. ఆదివాసీల సమస్యలపైన కూడా స్పందించాలని విన్నవించారు. సరికొత్త టెక్నాలజీ అందుబాటులో ఉన్నా వరదలను ఎదుర్కొవడంలో ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రకృతి విపత్తు అయినా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం సమాయత్తం చేయలేకపోయిందని, వెంటనే బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు భట్టి.

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌స్ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ విభాగం మంగళవారం సోదాలు నిర్వహించింది. ఈడీ అధికారులు ట్రాన్స్ ట్రాయ్ పవర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ మాలినేని సాంబశివరావుకు చెందిన నివాసాలు, ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహించారు. 9 వేల 394 కోట్ల రుణ మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి.

ఆదిలాబాద్ జిల్లా సిరిచెల్మా అప్పు చెల్లించలేదని శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేయించింది గ్రామ పంచాయతీ. గ్రామానికి చెందిన శ్రీనివాస్, రాజేందర్ వద్ద 24వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించక పోవడంతో సర్పంచ్ భర్త సమక్షంలో పంచాయితీ పెట్టించారు. అప్పు చెల్లించనుందకు శ్రీనివాస్ ఇంటికి తాళం వేయాలని పంచాయతీ పెద్దలు తీర్మానం చేశారు. దీంతో శ్రీనివాస్ కుటుంబం రాత్రంతా ఆరుబయటే నిద్రించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయం ఇంటికి తాళం తీయించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అనంతపురం జిల్లా శెనిగల గూడూరులో దళిత యువకుడిపై అగ్రవర్ణానికి చెందిన కొందరు దాడి చేశారు. అయితే తమ వర్గానికి చెందిన అమ్మాయిని వేధించింనందుకే కొట్టామంటూ పోలీసులకు అగ్రవర్ణాలు తెలియజేసినట్లు సమాచారం. తమకు అన్యాయం జరిగిందంటూ ఎస్పీ, కలెక్టర్‌లకు దళితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇరు వర్గాలకు డీఎస్పీ సర్ది చెప్పారు. మరోవైపు దళితుల్ని ఏ పనులకు పిలవకూడదని అగ్రవర్ణాలు తీర్మానించాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. దాంతో ఏక్షణాన ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయంభయంగా గడుపుతున్నారు.

తెలంగాణవ్యాప్తంగా ఆయుష్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. గత ఏడు రోజులుగా ఆయుష్ కాలేజీల దగ్గర నిరసన చేస్తున్నారు. 2014 లో ఇచ్చిన GO ప్రకారం తమకు స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా టైంలో కూడా వైద్యసేవలందిచామని, అయితే తమకు గత ఏడాది డిసెంబర్ నుండి స్తైఫండ్ అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయుష్ డాక్టర్లు. పెరుగుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని లేదంటే నిరవదిక సమ్మె చేస్తామని డిమాండ్ చేస్తున్నారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఉద్యోగస్తులు ఆఫీస్‌లోకి వెళ్లకుండా కార్యాలయం గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. తమను పర్మినెంట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సమానపనికి సమానవేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. నిరసనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

విశాఖలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పలువురిని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. టీడీపీతో పాటు లెఫ్ట్ నేతల్ని గృహనిర్బంధం చేశారు. విశాఖ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు అనంత లక్ష్మిని హౌస్ అరెస్ట్ చేశారు. అటు సీఐటీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, సీఐటూయు నేత మణిని గృహనిర్బంధం చేశారు.

విశాఖలో టీడీపీ నాయకులు ఆందోళన బాట పట్టారు. సుజాతనగర్‌కి చెందిన వృద్ధురాలు వరలక్ష్మిని.. వాలంటీర్ వెంకటేష్ హత్య చేయడంపై మండిపడుతున్నారు. ఈ ఘటనకు వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. వాలంటీర్ వెంకటేష్‌ను కఠినంగా శిక్షించాలంటూ పట్టుబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటున్నారు టీడీపీ నాయకులు.

తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ నేతలు పెట్రోల్ క్యాన్లతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇసుక అక్రమ రవాణాతో వైసీపీ నాయకులు ప్రజల ప్రాణాలను తీస్తున్నారంటూ టీడీపీ నేతలు చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఆమరణ దీక్షకు దిగారు. చంద్రగిరి నియోజకవర్గం రెడ్డివారిపల్లిలో ఈతకు వెళ్లిన కార్తీక్ అనే విద్యార్థి మృతి చెందడం ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఇష్టానుసారం ఇసుకను తవ్వేయడం వల్లనే విద్యార్థి మృత్యువాత పడ్డారన్నారు. మృతుని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

జగన్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. విశాఖలో వామపక్షాలు రోడ్డెక్కాయి. విభజన హామీల విషయంలో వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వామపక్ష నేతలు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, విశాఖ మెట్రో రైల్‌లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు కాకపోవడంపై మండిపడుతున్నారు.

అనంతపురం జిల్లా గుత్తిలో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గాంధీచౌక్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఖాళీ బిందెలతో భారీ ర్యాలీ తీశారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. మన్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. నీటి సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు. నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో నాటుబాంబుల కలకలం రేగింది. యలమంచిలి చౌరస్తా డేపులమెట్ట వద్ద నాటుబాంబు పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు మల్లేష్, చిన్నవాడు, రోహిణి రావులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరు మూలపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అడవి పందుల్ని తరిమేందుకు రైతు సింహాచలం పొలంలో నాటు బాంబులు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రైతు సింహాచలంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్.ప్రవీణ్ కుమార్. బడా బాబుల కోసం హైదరాబాద్‌లో కేబుల్ బ్రిడ్జిలు కడుతున్న ప్రభుత్వం.. చాలా గ్రామాల్లో వాగులపై వంతెనలు కట్టడం లేదన్నారు. వాగులు దాటుతూ చనిపోయిన వాళ్లే ఎక్కువగా ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు. తెలంగాణలో బహుజన వాదం బలపడటాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. అసైన్డ్ భూముల్లో ఫాంహౌస్‌ల నిర్మాణంపై కోర్టుకు వెళ్తామన్నారు.

పోలవరం సవరించిన అంచనాలకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.. 55,548.87 కోట్ల మేర రెండవ సవరించిన అంచనాలకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపినప్పటికీ ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ పెండింగ్‌లోనే ఉండటానికి కారణాలు ఏంటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.. దీనికి తప్పంతా వైసీపీ ప్రభుత్వానిదేనని కుండబద్దలు కొట్టినట్లుగా కేంద్రం పార్లమెంటు సాక్షిగా చెప్పింది.
55 , 548.87 కోట్ల రెండవ సవరించిన అంచనాలకు సలహా కమిటీ ఆమోదం తెలిపిందన్న కేంద్రం.. తరువాత 47 , 725.74 కోట్ల సవరించిన అంచనాలకే రివైజ్డ్ కాస్ట్ కమిటీ సిఫార్సు చేసిందని తెలిపింది.. సవరించిన అంచనాలకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబర్‌లో ప్రాజెక్టు అథారిటీకి ప్రతిపాదించిందని.. ఆ ప్రతిపాదనకు సంబంధించిన అదనపు సమాచారం, పత్రాలు, సోషియో ఎకనమిక్ సర్వే, డిస్ట్రిబ్యూటరీ నెటవర్క్ డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, రివైజ్‌డ్ కన్‌స్ట్రక్షన్ షెడ్యూల్ సహా అనేక కీలక అంశాలపై ప్రాజెక్టు అథారిటీ రాష్ర్ట ప్రభుత్వం నుంచి వివరాలు కోరిందని తెలిపింది. అయితే, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలు అందించలేదని కేంద్రం లిఖితపూర్వకంగా వెల్లడించింది.. అనేక మార్లు పదేపదే గుర్తు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అదనపు సమాచారం పత్రాలు వివరాలు అందించలేదంది.

ప్రభుత్వం అనుమతివ్వకపోయినా చంద్రబాబు పులివెందుల రోడ్‌షో కొనసాగుతుందన్నారు టీడీపీ నేతలు శ్రీనివాసులు రెడ్డి, బీటెక్ రవి. ఆగస్ట్ 2న కడప జిల్లాలో గండికోట, పైడి కాలువ ఎత్తిపోతల పథకాలను చంద్రబాబు సందర్శిస్తారని చెప్పారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలోనే కాదు.. పులివెందులలో కూడా అభివృద్ధి జరగలేదన్నారు. 3 వేల కోట్ల ప్రాజెక్ట్ పనులకు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు రాలేదన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో దుస్థితిని బయటి ప్రపంచానికి చెప్పడానికే చంద్రబాబు వస్తున్నారని తెలిపారు.

అల్లూరి జిల్లా వీఆర్ పురం మండలం చొప్పల్లిలో వరద బాధితులు ఆందోళనకు దిగారు. గిరిజన గ్రామాలు మునిగిపోతే అధికారులు పట్టించుకోవడం లేదని వినూత్నంగా నిరసన తెలిపారు. నీళ్లలోనే నిల్చొని నినాదాలు చేశారు. నిత్యావసర వస్తువులైనా అందించాలని వేడుకున్నారు. కనీసం వచ్చే ఏడాది వరదలొచ్చేలోపైనా.....పోలవరం ప్యాకేజీ ఇచ్చి పునరావాసాలు కల్పించాలని కోరారు.

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై మండిపడ్డారు టీడీపీ నేత బొండా ఉమా. సీఎం జగన్ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. వేలిముద్రల సేకరణతో బ్యాంకుల అకౌంట్లలో డబ్బులకు గ్యారెంటీ లేదని ఆరోపించారు. వాలంటీర్లు సేకరించిన వ్యక్తిగత సమాచారం.. ప్రైవేట్ వ్యక్తుల చేతిల్లో పెట్టడంపై జగన్ సమాధానం చెప్పాలని బొండా ఉమా డిమాండ్ చేశారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడిగా సమస్యలను పరిష్కరించకపోవడంతో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు నిర్వాసితులు వాపోయారు. మూడు జిల్లాల రైతాంగం కోసం భూములు త్యాగం చేస్తే... ప్రభుత్వం తమపై చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 11 గ్రామాల ప్రజల త్యాగాల ఫలితమే వెలిగొండ ప్రాజెక్ట్ అని రైతు సంఘం నేతలు అన్నారు. 18 ఏళ్లు దాటిన యువతీ యువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేసి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్(Ahmedabad)లోని ఓ బహుళ అంతస్తుల ఆస్పత్రి(Fire At Hospital)లో అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఎగిసిపడిన మంటలతో............ ఆస్పత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దాదాపు 100 మంది రోగులను(100 Patients Evacuated)సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంటలను అగ్నిమాపక బృందాలు అదుపులోకి తీసుకొచ్చాయి. ఆస్పత్రి బేస్‌మెంట్‌లో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
దట్టమైన పొగ ఆస్పత్రిని కమ్మేయడంతో రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సాహిబాగ్ ప్రాంతం(Sahibaug area )లోని ఆసుపత్రిలో తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం బాపనకుంటలో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలింది. ఘటన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నాడు నేడు పేరుతో ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, టీచర్లు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఏడాది నంచి పాఠశాల భవనం శిథిలావస్థలోనే ఉన్నా పట్టించుకునే నాధుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నల్లగొండకు చెందిన రాజకీయ నేత కుమారుడు వల్లభ రెడ్డి హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన కొడుకుపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారని రంగసాయిరెడ్డి ఆరోపించారు. లహరి రెడ్డి కింద పడటం వల్లే తలకు గాయమైందని తెలిపారు. న్యాయస్ధానంలో నిజానిజాలు బయటకి వస్తాయని అన్నారు. మరోవైపు తాను ఎవ్వరిపైనా ఫిర్యాదు చేయలేదని మృతురాలు లహరి రెడ్డి తండ్రి జైపాల్ రెడ్డి తెలిపారు. తన కుమార్తె మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. ఎవరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారో తెలియదని తెలిపారు.

మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఉప్పల్ ఏషియన్ థియేటర్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేగా లక్ష్మారెడ్డి ఫ్లెక్సీలను పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చింపివేశారు. ఫ్లెక్సీలు చింపుతుండగా వీడియోలు తీస్తున్న మీడియా సిబ్బందిపై పరమేశ్వర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. వెంటపడి మరి మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల ఎదుటే దాష్టికం ప్రదర్శించారు.

ఉమ్మడి అదిలాబాద్‌లో వరద బీభత్సం సృష్టించింది. ముదోల్ నియోజక వర్గంలో భారీగా పంట నష్టం ఏర్పడింది.దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. పంటనష్టాన్ని పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి తమ కష్టాలు చెప్పుకొని విలపించారు. ఓ మహిళ ఎమ్మెల్యే కాళ్లపై పడి విలపించింది. వరదతో నష్టపోయామని,తమను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసింది.

వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు పూచిక పుల్లతో సమానంగా తండ్రీ, కొడుకులు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదన్నారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేటీఆర్ బర్త్ డే పార్టీల్లో మునిగిపోయారని విరుచుకుపడ్డారు. మున్సిపల్ శాఖ మంత్రిని ఉరేసినా తప్పు లేదని రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

రంగల్ పోతననగర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నాయకులు- పోలీసుల మధ్య తోపులాటతో రణరంగంగా మారింది. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వెళుతున్న.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన అనుచరులు పురుషోత్తం, అనిల్‌ను సీఐ చితకబాదారు. పోలీసుల వైఖరిపై రాకేష్‌రెడ్డి మండిపడ్డారు. బాధిత ప్రజలకు సహాయం చేస్తే తప్పేంటని నిలదీశారు. ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవడం కూడా నేరమేనా అని పోలీసుల్ని ప్రశ్నించారు. భద్రకాళి చెరువుకు గండి పడటంతో పోతననగర్ ప్రమాదంలో ఉందని రాకేష్‌రెడ్డి అన్నారు.

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కృష్ణగిరి ప్రాంతంలో బాణసంచా గోదాంలో పేలుడు సంభవించింది. ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మూడు ఇళ్లు కుప్పకూలాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయకచర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అటు శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ములుగు జిల్లాపై వరుణుడు ప్రతాపం చూపించాడు. భారీ వర్షాలకు ములుగు జిల్లా అతలాకుతలం అయ్యింది. మరోవైపు ముంపు ప్రాంతాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించిన సత్యవతి రాథోడ్ ములుగు, భూపాలపల్లి జిల్లాలపై వర్షాలు పెను ప్రభావం చూపాయన్నారు. వరదల కారణంగా కొండాయి వద్ద 8మంది మృతి చెందడం బాధాకరమన్నారు. ఇక వదర ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు వేగంగా స్పందించారని..ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు జిల్లా వ్యాప్తంగా సుమారు 600మందిని కాపాడినట్లు తెలిపారు.

రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్‌రావు. ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారని అన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వేలాది మంది చావుకు కారణమైందన్నారు. మూడు గంటల కరెంట్ చాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని విమర్శించారు. తెలంగాణపై ముందుచూపుతో ఎవరు వ్యవహరిస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలన్నారుకిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్‌రావు విమర్శలు

అమిత్ షాపై మాజీ ఎంపీ వీహెచ్ ఫైరయ్యారు. ఇండియా కూటమిపై అమిత్ షా వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయన్నారు. సోనియా గాంధీ దేశం కోసం పని చేస్తున్నారని.. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనేన్నారు. ఇక ప్రధాని నిర్ణయాలు కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా ఉన్నాయని విమర్శించారు. మణిపూర్ ఘటనపై మోదీ ఎందుకు స్పందించలేదని నిలదీసిన ప్రశ్నించిన వీహెచ్.. మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలేనన్నారు.

మంత్రి విడుదల రజినీకి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. చిలకలూరిపేటలో రోడ్ల పరిస్థితిపై సవాల్ విసిరారు ప్రత్తిపాటి. నియోజకవర్గంలో రజినీ దోపిడికి రహదారులన్నీ గుంతలమయంగా మారాయని ఆరోపించారు. చిలకలూరిపేటలోని రహదారులను పరిశీలించిన ప్రత్తిపాటి.. ఆదాయం మంత్రి రజినీకి కష్టాలు మాత్రం ప్రజలకా అని ప్రశ్నించారు. ఒక్క కొండవీడు ప్రాంతంలోనే మట్టిపై మంత్రి రజినీ 100 కోట్లు దోచేశారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


