- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

ల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అనారోగ్య కారణాలతో 4 వారాలు బెయిల్ మంజూరు చేసింది. అయితే రాఘవకు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకించలేదు. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను వ్యతిరేకించింది ఈడీ. మరోవైపు ఈడీ కేసులో త్వరలో అప్రూవర్‌గా మారనున్నారు దినేష్ ఆరోరా. ఇప్పటికే సీబీఐ కేసులో అప్రూవర్‌గా మారాడు దినేష్.

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన యువకుల కత్తుల దాడిలో గాయపడిన సాయివరప్రసాద్ మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. నిన్న మీర్‌పేట్‌లోని జిల్లాలగూడ స్వాగత్ హోటల్ వద్ద ముగ్గురు యువకులు.. సాయివరప్రసాద్‌పై కత్తులతో దాడి చేసారు. ఆ తర్వాత అందరూ చూస్తుండగా మరో ముగ్గురిపై కత్తులు, బీరు బాటిళ్లతో యువకులు దాడులు చేసి హల్‌చల్ చేయడం సంచలనంగా మారింది.

అదాని పోర్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గడచిన 14 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నా యాజమాన్యానికి చీమకుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది. కార్మికులకు సంఘీభావంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఈరోజు జిల్లా కలెక్టర్ ని కలిశారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పోర్ట్ ఆధానిది కావడంతో అధికార పార్టీకి చెందిన నేతలు, అధికారులు కార్మికులకు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు.

అధికార బీఆర్ఎస్‌లో వర్గ పోరు ఉధృతంగా సాగుతోంది. సిట్టింగులకు ఫిట్టింగ్ పెట్టేందుకు ఆశావాహులు సిద్దమయ్యారు. ఉత్తర తెలంగాణలో గ్రూపు కొట్లాటలు తారాస్థాయికి చేరాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా ఆశావహులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అసమ్మతి నేతల తీరు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. పనితీరు సరిగా లేని 30 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు కట్ అని ఇప్పటికే సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. సిట్టింగులపై అసమ్మతి నేతల్ని అధిష్టానమే ప్రోత్సహిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. సర్వేల ఆధారంగా సిట్టింగ్‌లకు పోటీగా నేతల్ని సైలెంట్‌గా తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ గాంధీ హాస్పటల్ లో అత్యాధునిక హంగులతో, ఎంసీహెచ్ భవనం ప్రారంభం కానుంది. 55 కోట్లతో నిర్మించిన ఈ నూతన భవనంలో, మొత్తం రెండు వందల బెడ్స్ ఉంటాయి. ఎంసీహెచ్ సెంటర్ లో గర్భిణీలకు అన్ని రకాల వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు వైద్యులు. మిగతా ఎంసీహెచ్ సెంటర్ ల కన్నా మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. ఈ నెలాఖరులోపు నూతన ఎసీహెచ్ సెంటర్ ప్రారంభం కానుంది.

రాహుల్‌గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదని.. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. అసలు కేటీఆర్‌కు వ్యవసాయం గురించి తెలుసా అని ప్రశ్నించారు. భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలను..రాహుల్‌గాంధీ స్వయంగా తెలుసుకున్నారని చెప్పారు. అసలు ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. రేవంత్‌రెడ్డి మాటల్ని వక్రీకరించి పబ్బం గడుపుకోవాలని కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నాయకులు చూస్తున్నారని పొంగులేటి విమర్శించారు. పార్టీలో అందర్నీ కలుపుకొని ముందుకెళ్తానన్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సర్పంచులు ఆందోళన చేపట్టారు. పంచాయితీలో దొంగలు పడి నిధులు దోచేసారంటూ ఆందోళన ర్యాలీ చేపట్టారు. 14,15వ ఆర్ధిక సంఘం నిధులు దోచేసారంటూ ఆరోపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 12,910 పంచాయితీలలో 8,660కోట్లు నిధులు సర్పంచులకు తెలియకుండా నిధులు మాయం చేసారన్నారు. మాకు తెలియకుండా నిధులు మాయం చేసిన వారిపై సైబర్ నేరంగా కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసారు, తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సమాఖ్య అధ్యక్షురాలు నాగాబత్తుల శాంతకుమారి.

దేశ వ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలు.. నెలరోజుల్లోనే ఇద్దరు రైతులను కోటీశ్వరులను చేశాయి. మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన తుకారాం భాగోజి గాయకర్ 12 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఈ పంటపై సరైన అవగాహన ఉండడంతో దిగుబడి బాగా వచ్చింది. దీంతో నెల రోజుల్లోనే రూ.కోటిన్నరకు పైగా ఆదాయం సంపాదించారు. ఒక్కో పెట్టెను రూ.2,100 చొప్పున నారాయణ్‌గంజ్ మార్కెట్‌లో విక్రయించారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 900 పెట్టెలను అమ్మి రూ.18 లక్షలు సంపాదించారు.

తిరుపతిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన నేత కొట్టే సాయిపై సీఐ దాడి, అనుచిత వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు.శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ ఇటీవల ఓ నిరసనలో పాల్గొన్న జనసేన నేతపై దాడికి పాల్పడ్డారు.శ్రీకాళహస్తిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.నిరసనను ఆపివేసేందుకు రంగంలోకి దిగిన వన్ టౌన్ సీఐ అంజు యాదవ్ ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు.ఆమెపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నారు.

ఏపీ రాజధాని అమరావతి కోసం అలుపెరగని పోరాటం జరుగుతుంది. అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేపట్టారు.టీడీపీ నేత కేశినేని చిన్ని పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు.వనస్థలిపురం ఎన్టీఆర్ చౌరస్తా నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలని ఆర్5 జోన్ రద్దుచేయాలంటూ డిమాండ్ చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు.

కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరు హైవేపై టిఫిన్ సెంటర్ నడుపుతున్న 55 ఏళ్ల సత్యవతిని ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఇవ్వకపోవడంతో కత్తితో దాడి చేసి పరారయ్యారు. గాయపడిన సత్యవతిని తుని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది. ఈ హత్యకు ముందు దుండగులు ఓ ఆటో డ్రైవర్ పై దాడి అతని ఆటోను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు క్లూస్ టీంతో ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇటీవలే ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టిన పురందేశ్వరి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. అందుకే విస్తృతస్థాయిలో జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.ఈ నెల 23న ప్రొద్దుటూరులో రాయలసీమ నేతలతో పురందేశ్వరి సమావేశం కానున్నారు. 25న గుంటూరులో కోస్తా జిల్లాల నేతలతో భేటీ కానున్నారు. ఇక 26న రాజమండ్రిలో గోదావరి జిల్లాల నేతలను కలుసుకోనున్నారు.ఈ నెల 27న విశాఖలో ఉత్తరాంధ్ర నేతలతో పురందేశ్వరి సమావేశం జరపనున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ శ్రేణులను ఇప్పటినుంచే సమాయత్తం చేయాలని పురందేశ్వరి భావిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌జిల్లాలోని ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జడ్చర్ల సమీపంలోని బాలనగర్‌లో ఉన్న శ్రీనాథ్ రోటా ప్యాక్ ప్లాస్టిక్ పరిశ్రమలో ఫర్నేస్ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈఘటనలో పరిశ్రమలో పనిచేస్తున్న 13 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను షాద్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయం వద్ద అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు తరలివచ్చారు. మరోవైపు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని పకడ్బంది ఏర్పాట్లు చేశారు.

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని.. ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ INC లీడర్‌షిప్ అవార్డు వరించింది. భారత్ - అమెరికా మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్ టు పీపుల్ ఎక్స్‌ఛేంజ్ కార్యక్రమాలు నిర్వహించే.. యూఎస్ ఇండియా SME కౌన్సిల్ సంస్థ ఈ అవార్డును కిషన్‌రెడ్డికి అందజేసింది. భారతదేశపు ఘనమైన సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు పర్యాటకాభివృద్ధికి కిషన్‌రెడ్డి చేసిన కృషికి.. అమెరికాలోని మేరీలాండ్ స్టేట్ నుంచి వచ్చిన ప్రముఖులు ఈ అవార్డును అందజేశారు.

హైదరాబాద్ రాజ్ భవన్ ప్రాంగణంలోని అమ్మవారి ఆలయంలో గవర్నర్ తమిళిసై బోనాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారన్న గవర్నర్ బోనాల పండుగ వెనుక ఎంతో చరిత్ర ఉందన్నారు. ఆషాడ, శ్రావణ మాసాల్లో బోనాల పండుగను తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో నిర్వహిస్తారని తెలిపారు. అమ్మవారి దయవల్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడి జెడ్పీ హైస్కూల్‌లో పీఈటీ వెంకటేశ్వర్‌రావు పై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. విద్యార్ధినులను ఆటలాడించే సమయంలో.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్ధినులు ఫిర్యాదు చేయడంతో స్కూల్ ముందు ఆందోళనకు దిగారు విద్యార్ధి సంఘాల నేతలు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు... విద్యార్ధినుల అభియోగాలు నిర్ధారణ కావడంతో.. పీఈటీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు. స్కూల్ ఇంఛార్జ్ హెచ్‌ఎం ఫిర్యాదుతో.. పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.

అన్నవరం దేవస్థానంలో పురోహితుల వేలంపై తీవ్ర మండిపడుతున్నాయి హిందూ సంఘాలు. సీఎం జగన్‌కు భూకబ్జాలు, వేలం పాటలు అలవాటయ్యాయని, అందుకే ఇప్పుడు పురోహితులను వేలం వేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నేతలు. ఇలాంటి సలహాలన్నీ మీ ప్రభుత్వాన్ని దింపేందుకేనంటూ మండిపడ్డారు.దేవాలయ వ్యవస్థ పట్ల మీకు గౌరవం ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం వేశారు. వేలం వేయడానికి పురోహితులు ఏమైనా గొర్రెలా ? అంటూ మండిపడ్డారు. దమ్ముంటే పాస్టర్లు, ఇమామ్లను వేలం వేయాలంటూ సవాల్ చేశారు.

వైసీపీ మంత్రులు, ఎమ్యెల్యేలపై ప్రజలతోపాటు సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు మొదలెట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి పెద్ద అవినీతిపరడంటూ సొంత పార్టీకి చెందిన ఎంపీపీ కవిత విజయ్ రంగే గౌడ్ ఆరోపించింది. ఎమ్మెల్యే అక్రమాలపై సీబీఐ, సీఐడీలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి నుండి తనకు, కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. అంగన్వాడి ఉద్యోగాల్లో ఎమ్మెల్యే లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే ఉద్యోగం ఇచ్చారని వైసీపీ ఎంపీపీ తెలిపింది.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఓ వివాహితను బెదిరించిన 30 లక్షల వసూలు చేసింది ఓ ముఠా. కాలేజీ రోజుల్లో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపెడతామంటూ...కర్నూలు చెందిన గణేష్ నాయక్ బెదిరించి 30 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అనేక దఫాలుగా 30 లక్షల రూపాయలు ఆన్‌లైన్లో పంపించింది బాధితరాలు. ఇంకా డబ్బులు కావాలని వేధించడంతో...పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గణేష్, గంగాధర్‌తో పాటు ఓ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ప్రముఖ సినీ నటి సాయి పల్లవి అమర్ నాథ్ యాత్రలో తనకెదురైన అనుభవాన్ని పంచుకుంది. 60 ఏళ్ల వయసున్న తల్లిదండ్రులను తీసుకుని ఇటీవల ఆమె యాత్రకు వెళ్లొచ్చారు. ఫోటోలు, తన అభిప్రాయాన్ని ఇన్‌స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. అమర్ నాథ్ యాత్ర తన సంకల్ప శక్తిని సవాలు చేసిందని.. ధైర్యాన్ని పరీక్షించిందని సాయిపల్లవి తెలిపింది. మన జీవితమే ఒక తీర్థయాత్ర అన్నంత అనుభవాన్ని ఇచ్చిందని వివరించారు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనేది ఎప్పటినుంచో తనకు ఉన్న కోరిక అని సాయిపల్లవి తెలిపారు.

ప్రసిద్ధ ఏడు పాయల క్షేత్రంలో ఆషాడమాస ముగింపు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చివరి ఆదివారం కావడంతో వన దుర్గ అమ్మవారు ప్రకృతి స్వరూపిణిగా భక్తులకు దర్శనం ఇస్తోంది. విశేష అలంకరణతో అమ్మవారిని అలంకరించారు. ఆషాడ మాస చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌తో పాటు కర్నాటక, మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.

అమరావతిలో ఇవాళ బీజేపీ పదాధికారుల సమావేశం జరనగుంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఏపీలో పార్టీ బలోపేతం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర పథకాలను ప్రజల్లో తీసుకెళ్లే అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ మురళీ ధరన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవదర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ అధ్యక్షులు సోమువీర్రాజు హాజరవుతున్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 21న ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 21న బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర సభ ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ అధ్యక్షుల్లో ఎవరికీ దక్కని అరుదైన ఘనత కిషన్‌రెడ్డి సొంతమైంది. నాలుగుసార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డ్ సృష్టించారు.

శామీర్‌పేట కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. ఫైరింగ్ జరిపిన మనోజ్, అతనితో సహజీవనం చేస్తోన్న స్మిత మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తామంటూ పలువురు అమ్మాయిలను ఈ జంట ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడలోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన యువతికి మనోజ్, స్మిత జంట వల విసిరింది. ఆ కుటుంబం నుంచి 50 లక్షలు వసూలు చేసింది. స్మిత ఒరాకిల్ ఎంప్లాయిగా ఉంటూనే.. మనోజ్‌తో కలిసి మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీరి అక్రమాలపై పోలీసులు దృష్టిసారించారు.

తెలంగాణలో ఫ్రీ కరెంట్ వార్ ముదురుతోంది. మంత్రి హరీష్‌రావు రెఫరెండాన్ని పీసీసీ రేవంత్‌రెడ్డి స్వీకరించారు. 24 గంటల ఉచిత విద్యుత్‌పై కేసీఆర్‌కు సవాల్ విసిరారు. దమ్ముంటే సబ్ స్టేషన్ల దగ్గరకు రావాలన్నారు. 3వేల 500 సబ్ స్టేషన్లలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని రేవంత్ పేర్కొన్నారు. ప్రతి విద్యుత్ సబ్‌స్టేషన్ దగ్గర రెఫరెండానికి సిద్ధమని స్పష్టం చేశారు. అసెంబ్లీన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని.. కేసీఆర్‌కు దమ్ముంటే గజ్వేల్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.

పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మోదీ ఇంటి పేరు కేసులో తన శిక్షను నిలిపివేయాలన్న రాహుల్‌గాంధీ అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. నేరారోపణలపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు తీర్పును సమర్థించింది. రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టును తలుపుతట్టారు. పరువునష్టం కేసులో తన శిక్షను సస్పెండ్ చేయాలని అభ్యర్థించారు. రాహుల్ పిటిషన్ ఈ నెల 17న విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

విజయనగరం జిల్లా గ్రీన్ ఫీల్డ్ భాధితులు ఆందోళన బాట పట్టారు. మెంటాడ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ రహదారిపై టెంట్ వేసి బాధిత రైతులు ఆందోళన చేస్తున్నారు. భూ నిర్వాసితులకు నష్ట పరిహారం తక్షణమే అందించాలని.. ఆండర్ పాస్ సదుపాయం కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. 30 శాతం అదనపు పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి విస్మరించారంటూ మండిపడుతున్నారు. సమస్య పరిస్కారం అయ్యే వరకు నిరసన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.

తిరుపతి జిల్లా రేణుగుంటలోఉద్రిక్తత ఏర్పడింది. భవిష్యత్‌కు గ్యారెంటీ చైతన్య రథాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. యాత్ర ఆపాలంటూ... బస్సుకు నోటీసులు అంటించారు పోలీసులు. అయితే.. పోలీసుల ఆదేశాలను పట్టించుకోని టీడీపీ నేతలు.... బస్సు యాత్రను ప్రారంభించారు. శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వదంలాది బైక్ ర్యాలీ మధ్య బస్సు యాత్ర కొనసాగుతోంది.

తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల టీమ్‌ను కూడా సిద్ధం చేసింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాని ఒక ఇన్‌ఛార్జ్‌ను నియమించింది. పూర్తి స్థాయి ప్రచార కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మధు యాష్కీ, కోఛైర్మన్‌గా పొంగులేటి... కమిటీ మెంబర్‌గా జెట్టి కుసుమ కుమార్‌ను నియమించింది. తెలంగాణలో వరుసగా రాహుల్, ప్రియాంక గాంధీ సభలకు ప్లాన్ చేసింది. ఈనెల 20న కొల్లాపూర్‌లో ప్రియాంకా గాంధీ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొల్లాపూర్ బహిరంగ సభలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది.

గుంటూరు ఛానెల్ పొడిగించాలంటూ... రైతుల ఆందోళన కొనసాగుతోంది. గత 15 రోజులుగా కలెక్టరేట్ ముందు రిలే దీక్షలు చేస్తున్నారు రైతులు. ఈ దీక్షలకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మద్దతు పలికారు. గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఏవేవో కారణాలతో ప్రభుత్వం మభ్యపెడుతోందంటూ మండిపడ్డారు. సర్కారులో చలనం లేకపోవడం వల్లే.. ఓ పక్క రిలే దీక్షలు, మరో పక్క ఆందోళనకు సిద్ధమైనట్లు తెలిపారు. ఇవాళ పత్తిపాడు నియోజకవర్గంలో బంద్‌కు పిలుపునివ్వడంతో బంద్ కొనసాగుతోంది.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మసీదు గడ్డలో 400 మందికి పైగా ముస్లిం మైనార్టీ కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందాయని.. ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలపై వివరించాలని మాగంటి గోపీనాథ్ అన్నారు. బీఆర్‌ఎస్‌కు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కంచుకోటగా మారడానికి కార్యకర్తలు కష్టపడ్డారని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల భావోద్వేగాలు కాంగ్రెస్‌కు పట్టవన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇచ్చిన భిక్ష కాదని, ప్రజల హక్కు అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. వ్యవసాయం, విద్యుత్ అంశాలు మలిదశ ఉద్యమంలో..కీలక పాత్ర పోషించాయన్నారు. ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర ఏంటో ప్రజలకు తెలుసంటూ సెటైర్లు వేశారు. దేశంలోనే తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉందని అన్నారు. విద్యుత్ కోత వల్ల ఒక పని ఆగిపోయిందన్న పరిస్థితి తెలంగాణలో లేదని చెప్పారు.

దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ చూడని తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు రాయలసీమలో ఏర్పడుతున్నాయి. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు దిగువన తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జాడ లేదు.దీంతో కృష్ణ,తుంగభద్ర నదులు నీటి ప్రవాహం లేక వెలవెల బోతున్నాయి. ఇటు ప్రధాన ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. నీటి మట్టాలు పాతాళానికి పడిపోయాయి.

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ మధ్యలో మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డ్యాన్సర్ అవతారం ఎత్తాడు. డ్యాన్సింగ్ మూమెంట్స్‌తో అభిమానులను అలరించాడు. ఇదే టెస్టులో శుభ్‌మన్ గిల్ ఇలాగే డ్యాన్స్ చేసి అలరించాడు. మరోవైపు ఇదే మ్యాచ్ లో కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరుపున అత్యధిక టెస్టు పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలోకి చేరడంతో పాటు, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ని అధిగమించాడు.

ఎన్నికలు తరుముకొస్తున్న వేళ నేతలు యాత్రలు చేపట్టాలని అగ్రనాయకత్వం సూచిస్తోంది.నిత్యం ప్రజల మధ్యే వుండేలా చూసుకోవాలని రాహుల్ గాంధీ హితబోధ చేస్తున్నారు. యాత్రల ద్వారా పలు అంశాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలంటూ వరుసగా ఆయా రాష్ట్రాల నేతలతో రాహుల్ గాంధీ సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తున్నారు.కలిసికట్టుగా బస్సు యాత్రలు చేయాలని సూచిస్తున్నారు.రాహుల్ గాంధీ రెండో యాత్ర కూడా చేపడతారని గతంలోనే కాంగ్రెస్ ప్రకటించింది.ఐతే ఈ యాత్రపై ఇంకా స్పష్టత రాలేదు.రాహుల్ పిలుపు మేరకు తెలంగాణాలో కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర నిర్వహించే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


