- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

తనపై అక్రమ కేసులు పెట్టారంటూ... ప్రసాద్ అనేక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జరిగింది. దీంతో కుటుంబసభ్యులు సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వైసీపీ నేతల ప్రోద్భలంతో.. పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటున్నారు. అందువల్లే దీనికి కారకులైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అయితే.. పోలీసులు మాత్రం.. పశువును దొంగలించాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హాలహర్వి మండలం చింతకుంటలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగార్తులను బళ్లారి ఆసుపత్రికి తరలించారు. మృతులంతా... కర్ణాటకలోని శిడిగమనలకు చెందిన వారిగా గుర్తించారు. శిడిగమనల నుంచి మంత్రాలయం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు.. తెలంగాణ పథకాలు బాగున్నాయంటూ.. దేశ మంతా అమలు చేసే మోదీ సర్కార్.. నిధుల విషయంలో మాత్రం మొండిచేయి చూపుతోందన్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు ఒక్కటీ అమలు చేయలేదన్నారు.. నవోదయ విద్యాలయాలు, ఐటీఐఆర్, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని నామా మండిపడ్డారు. నీతి అయోగ్ సిఫారసు చేసినా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు.

బీజేపీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. ధరలు పెంచిన బీజేపీ నేతల్ని నిలదీయాలన్నారు. 50 ఏళ్లు అధికారం ఇస్తే.. కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు. కేసీఆర్ సారధ్యంలో నేడు తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పారు. బీజేపీ ఎంపీ అర్వింద్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని.. 70 ఏళ్ల వయస్సున్న కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు తిడతారా అని భగ్గుమన్నారు. రేవంత్ తెలంగాణ వాది కాదని.. తెలంగాణకు పట్టిన వ్యాధి అని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కుంభకోణాలేనని అన్నారు.

హైదరాబాద్‌లో చోరీ వాహనాలు విక్రయిస్తున్న రెండు అంతరాష్ట్ర దొంగల ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో పది మందిని అరెస్ట్ చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఆరాంఘర్ చౌరస్తా దగ్గర తనిఖీల్లో భాగంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... విచారణ తర్వాత 11కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలన్నీ పుణె, ఢిల్లీ, హర్యానాలో చోరీ చేసినట్టుగా నిర్ధారించారు. ఒరిజినల్ నెంబర్ ప్లేట్లతో పాటు చేసిస్ నంబర్లను ట్యాంపరింగ్ చేసి విక్రయిస్తున్నారు.

చితికిపోయిన కుల వృత్తులను కాపాడుకునేందుకే బీసీలకు లక్ష రూపాయాల ఆర్ధిసాయం అందజేస్తున్నామని చెప్పారు మంత్రి హరీష్‌రావు.. వృత్తిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట నియోజకవర్గంలో 200 మంది లబ్ధిదారులకు మంత్రి హరీష్‌రావు చెక్కులు అందజేశారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 330 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండగా.. ఇప్పుడవి ఒక వేయి 12కు చేరాయంటే సీఎం కేసీర్ కృషి ఫలితమేనని చెప్పారు. త్వరలోనే సిద్దిపేటలో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు.

శిశు పాలుడు తప్పుల్లాగా.. సీఎం జగన్ తప్పులను రాష్ట్ర ప్రజలు లెక్కబెడుతున్నారని.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 70 మంది టీడీపీ కార్యకర్తలను అన్యాయంగా జైల్లో పెట్టి వేధిస్తున్నా.. జగన్ కక్ష సాధింపు ఇంకా తీరలేదా అని ధ్వజమెత్తారు. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం జైళ్లుగా మార్చాల్సిందేనన్నారు. మరో పోరాటానికి తాము సిద్ధమన్నారు.

పుంగనూరు ఘటనలో వైసీపీ దాడులకు తెగబడితే.. టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడం ఏమిటని నల్లపాటి రాము ధ్వజమెత్తారు. పోలీసులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటన్నారు. ఇక టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. యువగళం దెబ్బకు వైసీపీ నేతలు వణికిపోతున్నారన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. ఈ కేసులకు భయపడేది లేదన్నారు. వైసీపీ నేతల్ని ప్రజలు తరిమి కొట్టడం ఖాయమన్నారు. ఏపీలో జరిగే అరాచకాలపై కేంద్రం స్పందించాలని కోరారు.

రాహుల్‌గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాహుల్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ మహిళా ఎంపీలు. అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రసంగించిన రాహుల్.. ఆ సమయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారని బీజేపీ మహిళా ఎంపీలు ఆరోపించారు. స్మృతి ఇరానీ ప్రసంగిస్తున్న సమయంలో ఆమె పట్ల రాహుల్ అసభ్యకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు బీజేపీ మహిళా ఎంపీలు. రాహుల్‌గాంధీ వీడియోను విడుదల చేయాలని స్పీకర్‌ను కోరారు.

మణిపుర్ అంశంపై లోక్‌సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీనే లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రెండోరోజు చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చర్చను ప్రారంభించి ప్రసంగించారు. దేశాన్ని మణిపుర్‌లో హత్య చేశారంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు.. దేశ ద్రోహులన్న ఆయన...వాళ్లు భరతమాత రక్షకులు కాదని హంతకులంటూ మండిపడ్డారు.

రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. మీరు భారత్ కు కాదు... అవినీతికి ప్రతిరూపమంటూ రాహుల్ పై మండిపడ్డారు. మణిపూర్ దేశంలో అంతర్భాగమేనన్న ఆమె...మణిపూర్‌ను ఎవరూ విభజించలేరంటూ ఫైర్ అయ్యారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి శాంతి నెలకొల్పామని... కానీ కాంగ్రెస్ వాళ్లు అక్కడికి వెళ్లి మళ్లీ 370 తెస్తామంటున్నారంటూ మండిపడ్డారు. భారత మాతను హత్య చేశారని రాహుల్ అంటుంటే... కాంగ్రెస్ సభ్యులు చప్పట్లు కొట్టడేమంటని ప్రశ్నించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.అంగళ్లులో తన పైనే హత్యాయత్నం చేశారని,సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతోనే హత్యాయత్నం జరిగిందన్నారు.అంగళ్లు ఘటనపై సీబీఐ విచారణకు చంద్రబాబు డిమాండ్ చేశారు. అంగళ్లుకు చేరుకునేలోపే 5 వేల కోట్ల స్కామ్‌ను బయటపెట్టానన్న చంద్రబాబు..అంగళ్లులో తనని చంపాలనే వైసీపీ వాళ్లు వచ్చారని అన్నారు. నాపైనే హత్యాయత్నం చేసి.. నా పైనే కేసు పెడతారా? అంటూ ప్రశ్నించారు.సైకో చెప్పాడు కాబట్టి మంత్రి పెద్దిరెడ్డి,అతడి తమ్ముడు దాడికి ప్రయత్నించారని అన్నారు.తనపై చాలాసార్లు హత్యాయత్నం చేయాలని ప్లాన్ చేశారని ఎక్కడికి వెళ్లిన దాడి చేస్తున్నారని అన్నారు.

రేవంత్ రెడ్డిపై తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్‌కు పిండం పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్సించారు. కరెంట్,నీళ్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెట్టిన పార్టీ నుంచి రేవంత్ వచ్చారంటూ విమర్శించారు. అందరిని ఆదుకుంటున్న కేసీఆర్‌కు పిండం పెడతావా అంటూ ప్రశ్నించారు. ఆంధ్ర తొత్తులకు తెలంగాణ అస్థిత్వాన్ని తాకట్టుపెట్టారంటూ రేవంత్ పై ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి.

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ ఆదర్శ వివాహం చేసుకున్నారు. ట్రైనీ IPS దేవేంద్ర కుమార్‌ను పెళ్లాడారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. నిరాడంబరంగా వివాహం చేసుకున్న అపరాజిత సింగ్, దేవేంద్ర కుమార్ లకు కలెక్టరేట్ ఉద్యోగుల అభినందనలు తెలిపారు.

వరంగల్ లోని AJ మిల్స్ కాలనీ CI వీరంగం సృష్టించాడు. చిరు హోటళ్ల నిర్వాహకులపై ప్రతాపం చూపారు.రాత్రి 10 గంటల తరువాత హోటళ్లు తెరిచి ఉంచారన్న నెపంతో..లాఠీతో రెచ్చిపోయాడు. తన పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 10 గంటల తర్వాత హోటళ్ళు తెరిచి కనపడొద్దు అంటూ..వీరంగం సృష్టించాడు. బార్లు, వైన్ షాపులు అర్ధరాత్రి వరకు బార్లా తెరిచుకొని తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నా పట్టించుకోలేదు. సదరు సీఐ తీరుపై బాధితులు పోలీస్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యేకు కు ఫిర్యాదు చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి హర్యానా, చత్తీస్‌ఘడ్ నుంచి భక్తులు పోటెత్తారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయిబాబా మహా సమాధిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. భక్తుల సత్యసాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం హోరెత్తింది.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెలుగు గంగ కాలువ పనులను మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పరిశీలించారు. కాలువలకు నీళ్లు విడుదల చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. కమీషన్లు తీసుకోవడం, కబ్జాలు చేయడం, తప్పుడు కేసులు పెట్టి ఆనందం పొందడంలో బిజీగా ఉన్న ఎమ్మెల్యేకు రైతుల కష్టాలు పట్టవా అంటూ మండిపడ్డారు. పంటలకు నీళ్లు వదలకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు అఖిలప్రియా. గంగుల కుటుంబానికి ఎన్ని పదవులు ఇచ్చినా ఆళ్లగడ్డ నియోకజవర్గానికి ఎలాంటి ఉపయోగంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అఖిలప్రియ.

కాంగ్రెస్, బీఆర్ఎస్ బంధం విడదీయరానిదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ ఆరోపించారు. కవితపై ఉన్న కేసుల గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గల్లీలో, ఢిల్లీలో కలిసి నడవడమే ఈ పార్టీలకు తెలుసని ఎద్దేవా చేశారు. కేకే, నామాలు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్రం మొత్తాన్ని రాష్ట్ర సర్కార్ మత్తులో ముంచింది అని విమర్శించారు. మద్యంపై ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుందని అన్నారు. ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం కొద్ది నెలల్లోనే ఉందని NVSS ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

విజయవాడలో వాంబే కాలనీలో రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఆందోళనకు దిగారు లబ్దిదారులు. డిస్నీ లాండ్ వద్ద ఉన్న కార్పోరేషన్ స్థలాన్ని పేదలకు రిజిస్ట్రేషన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. వీరికి సీపీఎం మద్దతు పలికింది. వైసీపీ నేతలకు దోచిపెట్టేందుకే నగరపాలక సంస్థ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు సీపీఎం కార్యవర్గ సభ్యులు బాబురావు. ఈ భూముల్ని పేదలకు పంచేవరకు తమ పోరాటం ఆగదన్నారు.

అనకాపల్లి జిల్లా చోడవరం మండలం మైచర్లపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకులు దాడి చేశారు. చేపలచెరువు వేలంపాట విషయంలో నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానగా మారింది. వేలంపాట ద్వారా వచ్చిన రెండు లక్షల రూపాయల్లో.. యాభై వేల రూపాలయలను పంచాయతికి తక్కువగా కట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. లెక్కలు చూపాలన్న టీడీపీ వర్గీయులపై వైసీపీ సర్పంచ్ మాణిక్యం దాడి చేశాడు. దీంతో ఆరుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీలో విపక్షాల కూటమి ఇండియాకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు బీజేపీ ఎంపీలు.పార్లమెంట్ ముందు ఉన్న గాంధీ విగ్రహాం ముందు... నిరసన తెలిపారు. క్విట్ ఇండియా అంటూ ప్లకార్డు ప్రదర్శించారు. కాంగ్రెస్ తో పాటు విపక్షాల తీరును ఖండించారు బీజేపీ ఎంపీలు. అవినీతికి కేరాఫ్ గా ఉన్న కాంగ్రెస్ ....ఇప్పుడు అవిశ్వాసం పేరుతో.. రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు.

ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలోఇళ్ల పట్టాల డొల్లతనంపై కలెక్టర్‌ను వైసీపీ నేతలే నిలదీశారు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ స్థలం ఎక్కడ ఉందో తెలియదంటున్నారు లబ్ధిదారులు. వారితో కలసి గుంటుపల్లిలో కలెక్టర్‌ను అడ్డకున్నారు అధికార పార్టీ నేతలు. ఉత్తుత్తి పట్టాలు మాకు వద్దంటూ జగనన్న ఇళ్ల పట్టాలను కలెక్టర్ కాళ్ల దగ్గర పడేసిన లబ్ధిదారులు. అసలైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు. లబ్ధిదారులతో కలిసి వైసీపీ నేతలే కలెక్టర్‌ను ఘెరావ్ చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

విశాఖపట్నం మర్రిపాలెం ఉడా లే అవుట్‌లోని అపార్టుమెంట్ నీటి సంపులో ఇద్దరు పిల్లలతో సహా తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతులు తల్లి సంధ్య, పిల్లలు ఆలేఖ్య, గౌతమ్ లుగా గుర్తించారు. కంచరపాలెం సీఐ సాయి ఆధ్వర్యంలో సంపులోని నీరు తోడి ముగ్గుర్ని బయటకు తీశారు. అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ తరలించారు. మృతురాలు సంధ్య భర్త లక్ష్మణ్ 9 నెలలుగా అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు.

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా శంభుని రెడ్లను ఎస్సీలో చేర్పిస్తానని హామీ ఇచ్చి వారి ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శంభునిరెడ్ల కులస్తులు వారి వాగ్దానాన్ని గుర్తు చేశారు. శంభుని రెడ్ల కులస్తును ఎస్సీ కేటగిరీలో చేర్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నానని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎస్సీలో కలిపేందుకు న్యాయం చేస్తానని మీడియా ముఖంగా అనడంతో సమస్య మొదలైంది. దీంతో దళిత సంఘాలు ఉద్యమబాట పట్టాయి.

అంగళ్ల ఘటనలో చంద్రబాబు సహా టీడీపీ నాయుకులపై కేసులు పెట్టడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఖండించారు. ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఏ పరిస్థితుల్లో కేసు పెట్టాలో.. పెట్టకూడదో అన్న విచక్షణ పోలీసులకు ఉండాలన్నారు. రాజ్యాంగ పరిధిలో ఉన్నవారిపై కేసులు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. చంద్రబాబుకు భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.

కృష్ణా జిల్లా గుడివాడలో చిరంజీవి అభిమానుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. డౌన్ డౌన్ కొడాలి నాని... జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తూ.... పట్టణ పురవీధుల్లో అభిమానులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కొడాలి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చిరంజీవి అభిమానుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, చిరంజీవి అభిమానుల మధ్య జరిగిన తోపులాట వాగ్వాదానికి దారితీసింది. పలువురు అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. వంగవీటి మోహనరంగా విగ్రహానికి క్షిరాభిషేకం చేశారు. చిరంజీవికి కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ సర్కార్‌పై టీడీపీ నేత దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. అంగళ్లు ఘర్షణలకు అసలు కుట్రదారులు జగన్, పెద్దిరెడ్డి,ఎస్పీ రిశాంత్‌రెడ్డినే నని అన్నారు. కేసులు మాపై కాదు..అసలైన కుట్రదారులపై పెట్టండని పోలీసులకు సూచించారు.తప్పుడు కేసులతో టీడీపీ నేతలు ఏం చేయలేరని అన్నారు. టీడీపీకి చెందిన 13 కార్లు ధ్వంసం చేసి తిరిగి తమ పైనే కేసులా..? అని ప్రశ్నించారు.ఎస్పీ రిశాంత్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక..20 మందిపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు

ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే తమను అరెస్ట్ చేసుకోవచ్చన్నారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి. చంద్రబాబుతో పాటు తామంతా విజయనగరంలోనే ఉన్నామని, ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నామన్నారు. వైసీపీ వాళ్లు దాడులు చేస్తే ... కేసులు మాత్రం తమపై పెడతారా? అంటూ ప్రశ్నించారు. పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందన్న ఆయన.... కేసుల్ని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు

జగన్ దురాగతాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందన్నారు టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా పాలిస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేపట్టిన పెన్నా టు వంశధార యాత్రకు ప్రజాదరణ లభిస్తోందన్నారు. అది చూసి ఓర్వలేక తప్పుడు కేసులు పెట్టారన్నారు. రాయలసీమ పర్యటనకు విశేష ఆదరణ వచ్చిందన్నారు. చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారన్నారు పల్లా శ్రీనివాస్.

తూర్పుగోదావరి జిల్లా బిక్కవొలు మండలం తొస్సిపూడిలో.....ఓ బాణాసంచా గోడౌన్లో పేలుడు జరిగింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమీపంలో ఉన్న రైస్ మిల్లు, పెట్రోల్ బంక్ పాక్షికంగా ధ్వంసమయ్యాయి. తొస్సిపూడిలోని ఐఓసీ పెట్రోల్ బంక్ దగ్గర ఓ గదిలో అక్రమంగా బాణాసంచాను నిల్వ చేశారు. ఒక్కసారిగా బాణాసంచా పేలడంతో చుట్టుపక్కలవారు భయభ్రాంతులకులోనయ్యారు. ఈ ఘటనలో సుమారు 20 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలో భూదొంగలు రెచ్చిపోతున్నారు. విలువైన భూములను మాయం చేస్తున్నారు. ఇప్పటికే 40 వేల కోట్ల విలువైన భూములను వైసీపీ నేతలు దోచుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నేతల భూదోపిడీపై చార్జిషీట్ పేరుతో టీడీపీ ఆందోళన చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు పాల్గొన్నారు. అధికార పార్టీ నేతల భూదందాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు దోచుకున్న భూములను స్వాధీనం చేసుకుంటామంటున్నారు.

అసెంబ్లీ స్పీకర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. సమావేశాలు స్పీకర్ గొప్పగా నిర్వహించాడంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలకు కనీసం రూమ్ కూడా ఇవ్వకపోతే.. గన్ మెన్స్ రూమ్‌లో కూర్చొని నోట్స్ రాసుకున్నామన్నారు.ఒక సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగింది కేవలం 14 రోజులేనన్నారు. శాసనసభలో ఎమ్మెల్యేకు కన్వెన్షన్ ఉంటాయని.. వాటిని ఎక్కడా స్పీకర్ పాటించలేదన్నారు. అసెంబ్లీలో ఎన్ని ప్రశ్నలు అడిగినా ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేరాలేదని.. ఎంఐఎం అడిగితే మాత్రం లేచి లేచి సమాధానాలు చెప్పారని విమర్శించారు.

హిందూధర్మం అనుసరించేవాళ్లనే టీటీడీ చైర్మన్‌గా నియమించాలని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. హిందూధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లైతేనే టీటీడీ చైర్మన్ పదవికి న్యాయం చేస్తారని చెప్పారు. గతంలో ప్రభుత్వం 80 మందితో ధర్మకర్తల మండలిని నియమించిందని.....దీనిపై విమర్శలు రావడంతో 52 మంది నియామకాలను నిలిపివేసిందన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ పదవులను ప్రభుత్వం రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తుందని పురందేశ్వరి ఆరోపించారు.

జగన్ సర్కారు ఉక్కుపాదం మోపినా ఏపీ విద్యుత్ ఉద్యోగులు ఎక్కడా తగ్గడం లేదు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ కాకినాడలో ఆందోళన చేపట్టారు. పాదయాత్రలో జగన్ విద్యుత్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి రాగానే మాట తప్పి.. మడమ తిప్పిన నాయకుడు జగన్ అని ఆరోపించారు. ప్రభుత్వం మాట తప్పడం వల్లే తాము ధర్నాకు దిగామని తెలిపారు. సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, డీఏలు తక్షణమే ఇవ్వాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సర్పంచ్‌లను జగన్ సర్కారు ఉత్సవ విగ్రహంలా మార్చిందని ఆరోపించారు. గ్రామాభివృద్ధి కోసం కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తోందని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో గ్రామ పంచాయతీలకు కేంద్రం 8 వేల 600 కోట్లకు పైగా నిధులు ఇచ్చిందన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక ఎంతో మంది సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈనెల 10న సర్పంచ్‌లకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపడుతుందని పురందేశ్వరి అన్నారు.

కేసీఆర్ సర్కారు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరును బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తప్పుబట్టారు. ఏడాదిలో కేవలం 14 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం 60 రోజుల పాటు సభను నిర్వహించేవారని గుర్తుచేశారు. అంశాలపై చర్చించకుండా, ప్రశ్నలకు అధికారపక్షం సమాధానం చెప్పకుండా వెకిలి మాటలతో అవమానపరుస్తున్నారని ఆరోపించారు. బీఏసీ సమావేశానికి బీజేపీని పిలవకుండా స్పీకర్ అవమాన పరిచారన్న ఆయన.. సభను నడుపుతున్న తీరు, బీజేపీకి సమయం ఇవ్వకపోవడాన్ని తప్పబట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


